ఎన్జీవోలకు ఫిట్‌మెంట్ విషయమై మిగులు బడ్జెట్‌వున్న తెలంగాణతో పోటీపడిన ఆంధ్ర సర్కారు ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో ఎందుకు ఊగిసలాడుతుందో అర్ధంకావడంలేదు. పింఛన్లు, నెలసరి జీతాలు చెల్లించలేని స్థితిలోకూడా ఆంధ్రా సర్కారు డ్వాక్రా రుణాలను, వ్యవసాయ రుణాలను రద్దుచేశారు. ఎస్సీ ఎస్టీ ఆడపిల్లల పెళ్ళికి పదివేల రూపాయల కానుకని ప్రకటించారు. చర్చ్‌లు, మసీదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఇన్ని సంస్కరణలు చేపట్టిన చంద్రబాబు ఆర్టీసీ విషయానికి వచ్చేసరికి ఎందుకు ఊగిసలాడుతున్నారో అర్ధంకావడంలేదు. ఎక్కడ ఏ చిన్న రాజకీయ అలజడి జరిగినా ముందుగా బద్దలయ్యేది ఆర్టీసీ బస్సుల అద్దాలే, తగలడేది ఆర్టీసీ బస్సులే. స్కూలు పిల్లలకి బస్ ఛార్జీలలో తగ్గింపు. ఉత్సవాలకు, ఊరేగింపులకి, మంత్రుల పర్యటనలకి ఉపయోగించేది ఈ బస్సులనే. విచ్చలవిడిగా ఆర్టీసీని వాడుకుంటూ నష్టాలొస్తున్నాయని వారి జీత భత్యాల పట్ల పట్టుదలకు పోవడం సమంజసంకాదు. సరిగా రోడ్లు వంతెనలు లేని మారుమూల గ్రామాలకు కూడా బస్సులను నడుపుతున్న ఆర్టీసీ సిబ్బంది సేవా భావాన్ని గుర్తించాలి. నక్సలైట్లు, టెర్రరిస్టులు పేల్చే ఆర్టీసీ బస్సులతో ప్రాణాలర్పిస్తున్న సిబ్బందిని ఒక్కసారి గుర్తుచేసుకోండి!
ఆర్టీసి బస్సులు ఆగిపోవడంతో ప్రజాజీవితం ఎంతగా స్తంభించిందో గమనించండి. వానలొచ్చినా, ఎండలు మండుతున్నా సేవా భావంతో బస్సులు నడిపే ఆర్టీసీ సిబ్బందిని మానవతా దృక్పధంతో అర్ధంజేసుకోండి. వారి డ్యూటీ అవర్స్, వర్కింగ్ డేస్ లెక్క వేయండి. డ్యూటీ ఎక్కిన డ్రైవరు తిన్నగా తిరిగొస్తాడన్న నమ్మకంలేకపోయినా భర్తని, కొడుకుని డ్యూటీకి పంపే భార్యని, తల్లిని గుర్తుచేసుకోండి. ఎన్నికల బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చేది, వరదలొచ్చినా భూకంపాలొచ్చినా ముందుండేది ఆర్టీసీ సిబ్బందే. ఆర్టీసీ అన్నది వ్యాపార సంస్ధకాదు, సేవా సంస్ధ. ఆర్టీసీ సిబ్బంది పోలీసులు, మిలట్రీవలె ఏ క్షణాన ఏ అవసరం వచ్చినా బస్సులను పరిగెత్తించడానికి సిద్ధంగా వుంటారు. వారి విషయంలో పట్టుదలకు పోవడం సమర్ధనీయం కాదు.