వారిద్దరూ తెలంగాణ ఉద్యమాన్ని తమ భూజాలపై మోశారు. ఒకరు రాజకీయంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తే మరొకరు అందర్నీ ఏకతాటిపైకి తెచ్చి రాష్ట్రం సాకరించే వరకూ పోరాడారు. అయితే రాష్ట్ర కల సాకరమైన వేళ నుంచే వారి మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పటినుంచి కూడా ఈ ఇద్దరు నాయకులు అంటీముట్టన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. అయితే తమ మధ్య ఎన్ని విబేధాలున్నా ఒకరిపై ఒకరు మాత్రం ఎప్పుడు విమర్శలకు దిగలేదు. కాని ఇప్పుడు వారి మధ్య ప్రత్యక్ష యుద్ధం తప్పేలా కనిపించడం లేదు.
మొదట నిరుద్యోగులకు బాసటగా నిలిచిన కోదండరాం వెంటనే ఉద్యోగు ప్రకటనలివ్వాలంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇక ఇప్పుడు ఆయన ఏకంగా కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. స్వామి అగ్నివేష్, యూటీఎఫ్ అధ్యక్షురాలు విమలక్క పాల్గొన్న ఈ కార్యక్రమంలో కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అదే వేదికపై కేసీఆర్‌ను విమర్శించిన వారి పక్కనే కోదండరాం కూర్చోవడం ప్రజల్లోకి కొత్త సంకేతాలను పంపింది. విమలక్క, స్వామి అగ్నివేష్ కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించినా కోదండరాం మాత్రం ప్రభుత్వ పనితీరును తప్పుబడుతూ ప్రసంగించారు. తన ప్రసంగంలో ఎక్కడా ఆయన కేసీఆర్ పేరును ఎత్తనప్పటికీ ఆయన మాట్లాడిన తీరు వారిమధ్య విభేదాలను చెప్పకనే చెప్పాయి.