8 మే, ఎంసెట్ పరీక్షల సందర్భంగా విద్యలవాడ విజయవాడలో పోలీసు యంత్రాంగం కీలకపాత్ర పోషించింది. ఓవైపు బండలు పగిలే ఎండలు, మరోవైపు ఇంటర్ విద్యకు కేంద్రమయిన విజయవాడలో తమ పిల్లల్ని తీసికెళ్ళడానికి సొంత వాహనాలలో ఎక్కడెక్కడినుంచో తరలివచ్చిన తలిదండ్రులతో రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. బస్సుల బంద్ వలన సకాలంలో ఎగ్జామినేషన్ సెంటరుకి వెళ్ళడం విద్యార్ధులకి ఓ పెను సవాలు. ఈ క్లిష్ట సయమంలో విద్యార్ధులు సకాలంలో ఎగ్జామినేషను సెంటరుకి వెళ్ళడానికి ట్రాఫిక్‌ని కంట్రోల్ చేస్తూ ట్రాన్స్‌పోర్టులేక నిస్సహాయంగా నిలబడ్డ విద్యార్ధులని పరీక్షా కేంద్రాలకి తీసికెళ్ళడానికి పోలీసు వాహనాలు, మోటారు సైకిళ్ళని వినియోగించిన తీరు విజయవాడ పోలీసుల కీర్తికిరీటంలో కలికితురాయిగా నిలిచిపోయింది. పైగా ఉదయం, మధ్యాహ్నం రెండు పరీక్షలు. ఎండల్ని తట్టుకుంటూ దాహార్తిని తీర్చుకుంటూ ట్రాఫిక్‌ని నియంత్రిస్తూ విజయవాడ పోలీసులు విద్యార్ధినీ విద్యార్ధులకు అందించిన సేవలకు ఉత్తమ సేవా పధకం లభించకపోతే ఆ పధకానికి విలువ లేనట్టే. ప్రజలకు మరింత దగ్గరవ్వడానికి ఇటువంటి సేవా కార్యక్రమాలకు అంకితమయిన పోలీసుల్ని ఉత్తేజపరుస్తూ, ప్రోత్సహిస్తూ అభినందనలందజేయడం పౌరుల బాధ్యత.
ఇదే సమయంలో, నారా లోకేష్‌తోపాటు అమెరికాలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఆటోలను ఏర్పాటుచేసి ఉచిన ప్రయాణ సౌకార్యాలు కల్పించడం ఆయన సేవా భావానికి, నాయకత్వానికి గీటురాయి. ఇటువంటి ఎమ్మెల్యే ఒక్కరుంటే చాలు - అనిపించింది, ఆయన ఏర్పాటు చేసిన ఉచిత ప్రయాణ సౌకర్యాలను చూసిన తర్వాత.
- తోటకూర రఘు