ఆర్టీసీ సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. తెలంగాణ సర్కారుకు మాత్రం ఏమాత్రం పట్టించుకోన్నట్లు కనిపిస్తోంది. నాలుగు రోజులుగా సమ్మె కొనసాగుతుండగా బస్సులు లేక ప్రజలు అపసోపాలు పడుతున్నా.. కనీసం ఎంప్లాయీస్ డిమాండ్ చేస్తున్న ఫిట్‌మెంట్‌పై కేసీఆర్ సర్కారు ఓ నిర్ణయం కూడా తీసుకోలేదు. మరోవైపు ఆర్టీసీ ఎండీ 27శాతం ఫిట్‌మెంట్‌కు ఓకే చెప్పినా.. అది కేవలం ఏపీ ఆర్టీసీ కార్మికులకే వర్తిస్తుందని, తెలంగాణ కార్మికులకు వర్తించదని సాంబశివరావు స్పష్టం చేశారు. దీంతో టీ కార్మికులు తీవ్ర అయోమయానికి లోనవుతున్నారు. ఇన్ని రోజులుగా సమ్మె కొనసాగుతున్నా.. టీసర్కారులో చలనం లేకపోవడంపై అటు ప్రజలు.. ఇటు కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా టీ-రవాణాశాఖ మంత్రి ఆర్టీసీ కార్మికుల ఫిట్‌మెంట్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ నేతృత్వంలో ఓ సబ్‌కమిటీని త్వరలో నియమిస్తామని చావుకబురు చల్లగా చెప్పారు. బస్సులు లేక ప్రజలు అగచాట్లకు గురవుతున్నా టీ-సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు వ్యవహరిస్తుందనేది ఇప్పుడు అంతుచిక్కకుండా ఉంది.
ప్రస్తుతానికి ఆర్టీసీని ఇంకా రెండు రాష్ట్రాల మధ్య విభజించలేదు. ఈ ప్రక్రియ ప్రస్తుతం మొదలైంది. ఇంతలోనే ఆర్టీసీ కార్మికుల సమ్మె కూడా మొదలవడంతో వారి డిమాండ్ల పరిష్కారాన్ని రెండు రాష్ట్రాల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఇక తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులకు న్యాయంచేస్తానని కేసీఆర్ ఎన్నోసార్లు ప్రకటించారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన మాదిరిగా తమకు 43శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలన్నది కార్మికుల డిమాండ్. ఇది ఆర్టీసీ మోయలేని భారమే. దీంతో చార్జీల పెంపు తప్పదు. అలా జరిగితే ప్రజలనుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన కేసీఆర్ ఈ విషయమై మిన్నకుండిపోతున్నారు. ఏపీ ప్రభుత్వం సూచనల మేరకు కార్మికులతో చర్చలు జరుపుతున్న ఆర్టీసీ ఎండీ సాంబశివరావుపైనే విషయం వదిలిపెట్టి మిన్నకుండిపోయింది. ఇలా అటు ప్రజలను ఇటు కార్మికులను కూడా మభ్యపెట్టాలని కేసీఆర్ సర్కారు భావించినట్లుగా కనిపిస్తోంది. అయితే శుక్రవారం కార్మికులు, ఆర్టీసీ ఎండీ మధ్య జరిగిన వివాదం అసలు విషయాన్ని బయటపెట్టింది.