గ్రూప్ డ్యాన్సర్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టి ఆ తర్వాత కొరియోగ్రాఫర్‌గా, నటునిగా, దర్శకునిగా.. ఇలా సాగిపోతున్న వ్యక్తి రాఘవలారెన్స్. ఆయనను నటునిగా, దర్శకునిగా ఇండస్ట్రీలో నిలబెట్టిన చిత్రాలలో ‘ముని, కాంచన’ చిత్రాలది అతి పెద్ద పాత్ర. కాగా ఇప్పుడు లారెన్స్ ‘గంగ’ పేరుతో ఆ చిత్రాలకి సీక్వెల్ గా చేసిన సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా రాఘవ లారెన్స్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..
తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రానికి తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది..?
నేను తీసిన ముని, కాంచన చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. కాంచన పెద్ద హిట్ అయిన తరువాత దానికి సీక్వెల్ గా వచ్చే సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యేలా ఉండాలని రెండు సంవత్సరాలు కష్టపడి 'గంగ' చిత్రాన్ని తెరకెక్కించాను. ఆ రెండు చిత్రాల కంటే ఈ సినిమాకి ఇంకా మంచి రెస్పాన్స్ వస్తోంది. భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమా రిలీజ్ ఒక వారం దాటినా ఈరోజు కూడా మాట్నీ షోస్ అన్ని ఫుల్ అయ్యాయి. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు.
రెండు సంవత్సరాలు సినిమా మేకింగ్ లోనే ఉన్నారా..?
స్టైల్ సినిమా తీసే సమయంలో ప్రభుదేవా గారిని నా భుజాల మీద పెట్టుకొని డాన్స్ చేసే సన్నివేశం ఉంటుంది. ఆ సీన్ షూట్ చేసేప్పుడు నా హెల్త్ కి కొంచెం ప్రాబ్లమ్ వచ్చింది. డాక్టర్ ఆరు నెలలు రెస్ట్ తీసుకోమని చెప్పారు. కాని నేను విశ్రాంతి తీసుకోలేదు. దాని తరువాత కొన్ని ఆరోగ్య సమస్యలు రావడంతో ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత షూటింగ్ మొదలు పెట్టాను.
తమిళ సినిమాలో ఉన్న కొన్ని సీన్స్ తెలుగులో లేవు అంటున్నారు నిజమేనా..?
సినిమాను తెలుగులో రిలీజ్ చేసేప్పుడు ఓపెనింగ్ సాంగ్, మరొక సాంగ్ ను డ్రిల్ చేసాం. ఈరోజు నుండి ఓపెనింగ్ సాంగ్ ను యాడ్ చేసాం. మరికొన్ని రోజుల్లో తమిళ్ లో హిట్ అయిన మరొక పాటను కూడా యాడ్ చేయనున్నాం.
క్లైమాక్స్ అంత లెంగ్దీ గా ఎందుకు చేసారు..?
కాంచన మూవీ క్లైమక్స్ ఒక మనిషికి, ఆత్మకి మధ్య ఫైట్ జరుగుతుంటుంది. అదే విధంగా ఈ సినిమాలో కూడా చేసే రొటీన్ గా ఉంటుంది. అందుకే ఈ సినిమాలో ఒక ఆత్మకి, మరో ఆత్మకు మధ్య ఫైట్ ఉంటుంది. అది ప్రేక్షకులకు అర్ధం అయ్యేలా తీసే ప్రాసెస్ లో మీకు అలా అనిపించిందనుకుంట.
నిత్య మీనన్ ను ఎలా ఒప్పించారు.. షూటింగ్ సమయంలో ఆమె చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారట నిజమేనా..?
నిత్య మీనన్ ను దృష్టిలో పెట్టుకొనే నేను ఆ పాత్రను రాసుకున్నాను. వికలాంగుల పాత్రలో నిత్య ఉంటేనే బావుంటుందనుకున్నాను. ముందు నిత్య కు గెస్ట్ రోల్ అని చెప్పగానే వెంటనే 'నో' అని చెప్పేశారు. తరువాత స్క్రిప్ట్ అంత ఎక్స్ ప్లైన్ చేయగానే ఓకే చేసారు. షూటింగ్ టైం లో టార్చర్ ఏం చేయలేదు. కొన్ని కొన్ని సీన్స్ లో బాగా నటించమని చెప్పాను అంతే..(నవ్వుతూ)
రజనికాంత్ సినిమా చూసి ఏమన్నారు..?
సినిమా రిలీజ్ కు ముందు రజని గారికి మూవీ స్టిల్స్ చూపించాను. సినిమా పెద్ద హిట్ అవుతుందని అప్పుడే చెప్పారు. సినిమా చూసిన తరువాత ఫోన్ చేసి మన ఇద్దరం కలిసి నెక్స్ట్ సినిమా చేస్తున్నాం. స్క్రిప్ట్ రెడీ చేస్కో అని చెప్పారు.
ముని 4 షూటింగ్ ఎప్పుడు ఉంటుంది..?
ప్రస్తుతం ముని 3 (గంగ) హిట్ ఎంజాయ్ చేస్తున్నాను. ముందు గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకొని ఓ నెల రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. ముని4 తీసే ఆలోచన ఉంటే మాత్రం కాస్టింగ్ సేమ్ అని చెప్పలేను కాని నా తల్లి పాత్రలో కోవై సరళ గారే నటిస్తారు.
'గంగ' ను బాలీవుడ్ రీమేక్ చేస్తున్నారా..?
బాలీవుడ్ లో చేయడానికి అగ్రిమెంట్స్ అన్ని రెడీ అయ్యాయి. హీరోగా నటించమని చాలా మందిని సంప్రదించగా వారు మాత్రం హీరో పాత్రలో కొన్ని మార్పులు చేయమని అడిగారు. హీరో అమ్మాయిలాగా పసుపు పూసుకొనే విషయం, షాప్ లో చీర కట్టుకునే సీన్, క్లైమాక్స్ లో చీర కట్టుకొని డాన్స్ చేసే సీన్ విషయాలలో చేంజస్ చేయమని అడిగారు. వాళ్ళ ఇమేజ్ కు అది కరెక్ట్ ఏమో.. అలా చేయడం నాకిష్టం లేదు. అందుకే రీమేక్ చేసే ఆలోచన మానేసుకున్నాను.
మీరు చేస్తున్న 'ఒక టికెట్ కు రెండు సినిమాలు' మూవీ ఎంత వరకు వచ్చింది..?
షూటింగ్ కంప్లీట్ అయింది. కాని 'గంగ' హిట్ తరువాత నా సినిమాలపై కొన్ని ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సో.. దానికి తగిన విధంగా కొంచెం మాస్ ఎలిమెంట్స్ ఏమైనా కలిపి రిలీజ్ చేయాలనుకుంటున్నాను.
ఏమైనా స్క్రిప్ట్స్ రెడీ చేసారా..?
పవన్ కళ్యాన్ గారి కోసం ఒక లైన్ అనుకున్నాను. పూర్తిగా స్క్రిప్ట్ రెడీ చేసిన తరువాత ఆయనకి వినిపిస్తాను. సినిమా కథ రాజకీయ పరంగా కాకుండా మంచి సందేశాత్మకంగా ఉంటుంది.
డాన్స్ స్కూల్ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా..?
చెన్నై లో కొందరిని చదివిస్తున్న సంగతి మీకు తెలిసిందే. అదే విధంగా ఇక్కడ కూడా ఓ ట్రస్ట్ ను నిర్మించాలనుకుంటున్నా. డాన్స్ స్కూల్ పెట్టాలనే ఆలోచన అయితే లేదు. నాకు పెట్టాలి అనిపిస్తే ఖచ్చితంగా పెడతాను.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?
'పటాస్' సినిమాను తమిళ్ రీమేక్ లో హీరోగా చేయనున్నాను. ఆ సినిమాలో చాలా సీన్స్ నాకు నచ్చాయి. ఆ సినిమాకి డైరెక్టర్ ని వెతికే పనిలో ఉన్నాను.