కాంగ్రెస్, జగన్‌మోహన్‌రెడ్డిల మధ్య వివాదం ఇరువర్గాలను కోలుకోలేని దెబ్బతీసింది. వైఎస్‌ఆర్ మృతి తర్వాత పార్టీలకతీతంగా జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలనే డిమాండ్ వినబడింది. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా జగన్‌కు మద్దతుగా సంతకాలు సేకరించి పార్టీ అధిష్టానానికి పంపారు. కాని సోనియా మాత్రం జగన్ ఎంపికపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇక సెంటిమెంట్ పర్వం ముగిసే వరకూ ఇప్పుడు.. అప్పుడు.. అంటూ జగన్‌కు సీఎం పదవి ఇవ్వనున్నట్లు ఆశలు చూపారు. ఆ తర్వాత రోశయ్యను సీఎంను కొనసాగిస్తూ జగన్‌ను కాంగ్రెస్‌కు పూర్తిగా దూరం చేసుకున్నారు. దీంతో అటు తెలంగాణ.. ఇటు ఏపీల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. ఇక జగన్ స్థాపించిన వైసీపీ పార్టీ కూడా విపక్షానికి పరిమితమైంది.
అయితే ఇంత కాలానికి తాను చేసిన తప్పును కాంగ్రెస్ అధిష్టానం గుర్తించినట్లు కనిపిస్తోంది. రోశయ్య తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డిని సీఎం చేసి తప్పు చేసినట్లు రాహుల్‌గాంధీ ఏపీ నాయకులతో చెప్పినట్లు సమాచారం. అర్హతలేని వ్యక్తిని అందలమెక్కిస్తే పార్టీని పూర్తిగా దెబ్బతీశాడని, జైసమైక్యాంధ్ర పార్టీ అంటూ కాంగ్రెస్‌కు ద్రోహం చేశాడని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కిరణ్‌కుమార్‌రెడ్డికి బదులు జగన్‌ను సీఎం చేస్తే పార్టీ పటిష్టంగా తయారయ్యేదని రాహుల్ వ్యాఖ్యల్లో కనిపిస్తోందని ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చలన్నీ 2019లో తిరిగి కాంగ్రెస్, జగన్‌లు ఏకమవుతారని చెప్పడానికి సంకేతాలా..? ఏమో కావచ్చు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు.