‘ఇంటర్, ఎంసెట్’ పోటీ పరీక్షల నిర్వహణ, వాహనాల ఎంట్రీటాక్సు తాజాగా ఉన్నత విద్యామండలిపై హైకోర్టుతీర్పు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వరుసగా దెబ్బమీద దెబ్బ. వీటినిమించి ప్రత్యేక హోదాపై కేంద్రం నాన్చుడు ధోరణి.
ప్రత్యేకహోదాపై ఇంతకాలం మోదీ ప్రభుత్వాన్ని ముద్దాయిగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తోంది కాంగ్రెసు. హైకోర్టు తీర్పులతో విభజన బిల్లులోని డొల్లతనం బయటపడిరది. ఎంత అనాలోచితంగా అసమగ్రంగా తొందరగా విభజన బిల్లుని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో అర్ధమవుతోంది. ఆ లొసుగుల్ని సవరించాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మొత్తుకుంటున్నా కాంగ్రెసు ఇంతకాలం బుకాయించింది. హైకోర్టు తీర్పుతో ఇప్పుడు కాంగ్రెసు ముద్దాయిగా నిలబడాల్సిందే. చేసిన పొరపాట్లని దిద్దుకోవడానికి రాజ్యసభలో మెజారిటీ రీత్యా ఇంకా కాంగ్రెసుకి అవకాశం వుంది. భూసేకరణ బిల్లుపై మోకాలడ్డిన కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులోని లోపాలని సరిదిద్దడానికి నడుం బిగించకుంటే కాంగ్రెసు పరిస్ధితి ఆంధ్రాలో మరింత భయానకంగా వుంటుంది. కేంద్రం భూసేకరణ బిల్లు విషయంలో ఎంత పట్టుదలగా వుందో, ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చిన హామీల విషయమై అంతే పట్టుదలను కాంగ్రెసు ప్రదర్శించాలి. బీహార్ ఎన్నికలోపు ప్రత్యేక హోదాపై ముందడుగు వేయలేని అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడానికి కాంగ్రెసుకి ఇదే తగిన సమయం.