మోడీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తోంది. ఈ ఏడాది కాలంలో సంస్కరణలకు సంబంధించి అతిపెద్ద అడుగు బుధవారం పడింది. గూడ్స్, సర్వీస్ ట్యాక్స్(జీఎస్‌టీ)బిల్లును బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందింది. దీంతో దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను వసూలు అమలులోకి రానుంది. విపక్షాలు ఈ బిల్లును ఎంతగా వ్యతిరేకించినప్పటికీ మోడీ సర్కారు మాత్రం జీఎస్‌టీ బిల్లును తీసుకురావడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే బుధవారం జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా పలువురు బీజేపీ ఎంపీలే ఓటు వేయడం చర్చనీయాంశంగా మారింది.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్టి బుధవారం జీఎస్‌టీ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు మద్దతుగా 352 ఓట్లు, వ్యతిరేకంగా 37 ఓట్లు వచ్చాయి. బిల్లుకు వ్యతిరేకంగా పడిన 37 ఓట్లలోనూ 12 అధికార బీజేపీ ఎంపీల సభ్యుల ఓట్టే కావడం గమనార్హం. అయితే వారు బిల్లును వ్యతిరేకిస్తూ ఈ ఓట్లు వేయలేదు. తనకు ఇచ్చిన ఓటింగ్ మిషన్‌లో ఏ బటన్ నొక్కాలో తెలియక బిల్లును వ్యతిరేకిస్తూ ఉన్న రెడ్ బటన్‌ను నొక్కినట్లు సమాచారం. ఇంత ప్రతిష్టాత్మక బిల్లుకు సంబంధించి ఎంపీలకు ఏ బటన్ నొక్కాలో కూడా తెలియకుండా వ్యవహరించడం పార్లమెంట్ ప్రతిష్టను మసకబార్చింది. తమ ఎంపీలు తప్పుడు బటన్ నొక్కారని గమనించిన ఆర్థిక మంత్రి మళ్లీ పేపర్ ఓటింగ్‌కు డిమాండ్ చేయగా స్పీకర్ అంగీకరించలేదు.