ఒక రాష్ట్రాన్ని విభజించే సమయంలో రాజధాని స్ధల నిర్ణయం, నిధుల కేటాయింపు జరగాలి. ఆస్తులు, అప్పులు, విద్య ఉపాధి అవకాశాలు, నీళ్ళు నిధులు వగైరా వగైరా బిల్లులో స్పష్టంగా వుండాలి. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడానికి మిగిలిన రాష్ట్రాల సహకారమూ వుండాలి. విభజన బిల్లులో ఈ అంశాలన్నీ చేర్చాలి. ఇవేమీ జరగకుండా, హడావిడిగా బిల్లుని ప్రవేశపెట్టి ‘మమ’ అనిపించారు. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటుకి వచ్చినప్పుడు సుష్మాస్వరాజ్ పచ్చజెండా ఊపారు గాని రాజ్యసభలో వెంకయ్యనాయుడు, ఏచూరి అడ్డం తిరిగారు. వెంకయ్యనాయుడు పట్టుదలతో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రత్యేకహోదాపై ఓ ప్రకటన చేశారు. ఆ ప్రకటన విభజన బిల్లులో లేనందున అమలు చేయడంలో ఇబ్బందులున్నాయని, అన్నమాటను నిలబెట్టుకుంటామంటూ కాలయాపన చేస్తోంది బిజెపి. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెసుకి బిల్లుని ప్రవేశపెట్టే సమయంలో ఇచ్చిన హామీల అమలుకి కృషి చేయాల్సిన బాధ్యత వుంది. రాజ్యసభలో అధికార పక్షానికి బలంలేదు. రాజ్యసభలో భూసేకరణ బిల్లుని కాంగ్రెసు అడ్డుకుంటోంది. భూసేకరణ బిల్లుపై బేరసారాలకు దిగిన బిజెపిని ముందు ‘ఆంధ్ర - తెలంగాణ’ రాష్ట్రాలకి ప్రత్యేకహోదా తేల్చండి అంటూ కాంగ్రెసు పార్టీ ఎందుకు ప్రశ్నించడంలేదు అన్నదే తెలుగువారి ఆవేదన. కాంగ్రెసు కూడా నాటకమాడుతోంది అన్న భావనలో వున్నారు ఉభయ రాష్ట్ర వాసులు. ప్రజల సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెసు నాయకత్వానిదే. కాంగ్రెసు చిత్తశుద్ధికి, నిజాయితీకి ఇదో అగ్ని పరీక్ష.