హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడం.. ఆ తర్వాత నాలిక కరుచుకోవడం తెలంగాణ సర్కారు వంతైంది. ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో సచివాలయం ఏర్పాటు, పార్లమెంటరీ సెక్రెటరీల నియామకం తదితర విషయాల్లో తెలంగాణ సర్కారు తొందరపడి తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు చిక్కుల్లో పడేశాయి. దీనికితోడు ఇప్పుడు కేసీఆర్ సర్కారు తీసుకున్న మరో నిర్ణయంపై కూడా కోర్టులో పిల్ దాఖలైంది. ఎన్టీఆర్ స్టేడియంను కళాభారతి పేరుతో వివిధ సంస్థలకు అప్పగించడంపై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది.
ట్యాంకుబండ్ తీరంలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తానని, ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతి పేరుతో సంస్కృతిక ప్రదర్శనల ఏర్పాటుకు భవనాలు నిర్మిస్తానని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరాపార్క్‌లు ఎంతోకాలంగా పిల్లలు సేద తీరడానికి, పెద్దలు ఉదయం సమయంలో వాకింగ్ చేసుకోవడానికి వినియోగపడుతున్నాయని, వీటిని కళాభారతి సంస్థకు అప్పగించడం సబబు కాదని ఇందిరాపార్క్ పాదాచారుల సంఘం అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ హైకోర్టుకు వెళ్లారు. కళల ప్రదర్శనకు రవీంద్రభారతితో సహా పలు సంస్థలున్నప్పుడు ఎన్టీఆర్‌స్టేడియం స్థలాన్ని అప్పగించాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. గ్రేటర్ కార్పొరేషన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కోర్టు రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరి ఈ విషయమై కోర్టు ఏంతేలుస్తుందో వేచిచూడాలి.