టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్‌రెడ్డికి మైలేజీ మరింత పెరిగిపోయింది. రేవంత్ రేంజ్‌లో ప్రభుత్వాన్ని విమర్శించే నాయకుడు కరువవడంతో ప్రజలు రేవంత్ విమర్శల కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే అదనుగా టీడీపీలో తెలంగాణ రాష్ట్రం వరకు నం.1 పొజిషన్ దక్కించుకోవడానికి రేవంత్ కూడా చకచకా పావులు కదుపుతున్నాడు. ఇదిలావుండగా ఇటీవలే హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్‌కు ప్రజల్లో మరింత ఆదరణ పెంచింది. పార్లమెంట్ సెక్రెటరీల నియామకం చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి పంతం నెగ్గినట్టయ్యింది. ఈ విషయమే రేవంత్‌రెడ్డియే కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే.
తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులను రేవంత్‌రెడ్డి స్వయంగా తీసుకెళ్లి సీఎమ్ ఆఫీసు అధికారులకు అందజేశారు. ఇక పార్లమెంట్ సెక్రెటరీలకు ఇస్తున్న అదనపు సౌకర్యాలను తొలగించాలని ఆయన అధికారులను కోరారు. ఇప్పటికే తెలంగాణలో పదవులు దక్కలేదన్న ఆగ్రహం టీఆర్‌ఎస్‌లో పలువురు నాయకులకు ఉంది. ఇలాంటి సమయంలో పార్లమెంటు సెక్రెటరీల తొలగింపుతో రాజకీయ నిరుద్యోగుల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది సీఎంకు ఏమాత్రం రుచించని విషయం. దీనికితోడు రేవంత్‌రెడ్డి స్వయంగా తీసుకెళ్లి హైకోర్టు ఆదేశాల ప్రతులను అందజేయడం వెనుక కేసీఆర్‌ను రెచ్చగొట్టాలనే ఉద్దేశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి.