అనంతపురంలో వైసీపీ నాయకుడు ప్రసాద్‌రెడ్డి హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పట్టపగలు ఎమ్మార్వో ఆఫీసులో దుండగులు ఆయన్ను వేట కొడవళ్లతో దారుణంగా హతమార్చడంతో ప్రభుత్వంపై కూడా విమర్శలొచ్చాయి. అంతేకాకుండా ఈ హత్యలో మంత్రి సునీత తనయుడు శ్రీరాం హస్తం ఉన్నట్లు విపక్షాలు ఆరోపించాయి. సాధారణంగా అయితే ఇలాంటి వ్యవహారాల్లో మంత్రులు తలదూర్చారు. కాని మంత్రి సునీత మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించారు.
రాప్తాడులో హత్య తర్వాత ప్రభుత్వం అక్కడి సీఐ, ఎస్‌ఐలను రిజర్వ్‌లోకి పంపుతూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే హత్య జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ నాయకులకు సమాధానం ఇవ్వడానికి వారిద్దరిపై చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే మంత్రి సునీత ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఏకంగా తన గన్‌మన్‌లను వెనక్కిపంపించి ప్రభుత్వ నిర్ణయంపై తన వ్యతిరేకతను చాటిచెప్పారు. ఈ పరిణామాన్ని ఊహించని ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సీఐ, ఎస్‌ఐలను అక్కడే విధుల్లో నియమించారు. దీంతో అలకవీడిన మంత్రి పరిటాల సునీత సోమవారం నాటి క్యాబినెట్ సమావేశానికి హాజరయ్యారు.