బీజేపీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదన్న బాధలో ఉన్న నాగం జనార్దన్‌రెడ్డి పార్టీ మారే అవకాశాలున్నట్లు వార్తలు వెలువడ్డాయి. తాను తిరిగి టీడీపీలో చేరుతారని, లేకపోతే నగారాను తిరిగి పునరుద్ధరిస్తారన్న కథనాలు వెలువడ్డాయి. ఈ మేరకు ఆయన తన సన్నిహితులు, ముఖ్య అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు కూడా కొన్ని చానళ్లు ప్రసారం చేశాయి. అయితే తాను పార్టీ మారే ప్రసక్తే లేదని నాగం ఇప్పుడు తేల్చిచెబుతున్నారు.
నాగం జనార్దన్‌రెడ్డి సామర్థ్యానికి తగిన విధంగా బీజేపీలో ప్రోత్సాహం లభించడం లేదన్నది సుస్పష్టం. అదేసమయంలో ఆయన పార్టీ మారే ఆలోచన చేసి ఉండవచ్చు. అయితే రోజుకో ఎమ్మెల్యే దూరమవుతున్న టీడీపీలో ఆయన చేరుతారన్న వార్త కథనాలను మొదట ప్రజలు కూడా నమ్మలేదు. అంతేకాకుండా ప్రస్తుతం తగిన ఆర్థిక బలం, అనుచర బలం లేని నగారాను పునరుద్ధరిస్తాన్న కథనాలు కూడా వాస్తవదూరమే. ఇక తాను పార్టీ మారుతున్నట్లు వెలువడుతున్న కథనాల్లో వాస్తవం లేదని స్వయంగా నాగం జనార్దన్‌రెడ్డియే స్పష్టతనిచ్చారు. తాను విలువలున్న నాయకుడినని, బీజేపీలోనే కొనసాగుతానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తాను మే9నుంచి తెలంగాణ బచావో మిషన్ ప్రారంభిస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. అయితే అసంతృప్తితో ఉన్న నాగంను బీజేపీ అధిష్టానం బుజ్జగించడంతోనే పార్టీ మారే ఆలోచనను ఆయన విరమించుకున్నారన్న వాదనలు కూడా వినబడుతున్నాయి.