దాసరి నారాయణరావు చిక్కుల్లో పడ్డారు. బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించిన చార్జిషీట్‌లో సీబీఐ దాసరి పేరును చేర్చింది. దీంతో ఆయన ఇప్పుడు నిందితుడిగా బోనులో నిలబడక తప్పని పరిస్థితి నెలకొంది. దేశంలో 2-జీ తర్వాత అంతటి కుంభకోణంగా చెప్పుకోబడుతున్న బోగ్గు స్కాం యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఈ కుంభకోణంలో దాసరి కూడా చిక్కుకోవడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగే అవకాశం ఉంది.
2004లో బొగ్గుశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు దాసరి నారాయణరావు జిందాల్ కంపెనీకి అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఇక తనకు అనుకూలంగా వ్యవహరించిన దాసరి కంపెనీల్లోకి జిందాల్ పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి దాసరితోపాటు పారిశ్రామికతేత్త నవీన్‌జిందాల్, జార్ఖండ్ మాజీ మంత్రి మధుకోడా, బొగ్గుశాఖ మాజీ అధికారి గుప్తాతోపాటు 14మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. అయితే మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌ను కూడా మొదట సీబీఐ విచారించినట్లు వార్తలువెలువడ్డాయి. అయితే ఆయన పేరును చార్జిషీటులో చేర్చకుండా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే మన్‌మోహన్‌సింగ్ కూడా నిందితుడిగా కోర్టు బోను ఎక్కాల్సిన పరిస్థితి నెలకొనేది.