బీజేపీ అద్భుతమైన పాలనను అందిస్తున్నట్లు మోడీ ఎంత కలరింగ్ ఇచ్చినా.. ఆయన పార్టీ నాయకులు మాత్రం పరువు తీస్తున్నారు. ఇష్టారీతిగా స్టేట్‌మెంట్లు ఇస్తూ.. మోడీ సర్కారును ప్రజల్లో చులకన చేస్తున్నారు. తెల్లతోలు వల్లే సోనియా ఇంత ఎదిగారంటూ ఒకరు స్టేట్‌మెంట్ ఇస్తే.. హిందు స్త్రీలు అధిక సంఖ్యలో పిల్లలను కనాలంటూ మరోకొరు పిలుపునిచ్చారు. వీటికి సర్దిచెప్పలేక బీజేపీ అధికార ప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు.
బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ నోటికి ఈ మధ్య అదుపులేకుండా పోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగానే ఈయన వివాదాస్పదమైన అంశాలపై చాలా సులువుగా స్టేట్‌మెంట్లు ఇస్తుంటాడు. ఇక బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన దూకుడు మరింత ఎక్కువైనట్లు కనిపిస్తోంది. నేపాల్‌లో వచ్చిన భూకంపానికి రాహుల్‌గాంధీయే కారణమంటూ బాంబు పేల్చారు సాక్షి మహరాజ్. బీఫ్ తినే అలవాటున్న రాహుల్‌గాంధీ శుద్ధి చేసుకోకుండానే కేదరినాథ్ యాత్రకు వెళ్లారని, దీంతోనే ఈ ప్రళయం వచ్చిందని సాక్షి మహారాజ్ చెప్పారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. భూకంపాన్ని.. రాహుల్‌కు ముడిపెట్టడం సాక్షి మహారాజ్ అజ్ఞానమని విమర్శించారు. ఇక సాక్షి మహరాజ్ స్టేట్‌మెంట్‌పై అటు బీజేపీ నాయకులు కూడా డిఫెన్స్‌లో పడ్డారు. భూకంపం వచ్చి ఓవైపు ప్రజలు బాధపడుతుంటే.. సాక్షి మహరాజ్ దాన్ని కూడా రాజకీయం చేయడం పార్టీని ప్రజల్లో చులకన చేసే అవకాశముందని వారు వాపోతున్నారు.