జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై సందిగ్ధత వీడింది. ఎట్టకేలకు దీనికి సంబంధించి హైకోర్టు స్పష్టతనిచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 16లోపు ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ పాలకవర్గం పదవీ కాలం ఎప్పుడో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే వార్డుల పునర్‌విభజన చేయాలంటూ ఇక్కడ ఎన్నికలు నిర్వహించకుండా తెలంగాణ సర్కారు కాలయాపన చేస్తూ వస్తోంది. కాగా జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్ ఏమాత్రం బలంగా లేకపోవడంతోనే ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తోందన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ అంశం కోర్టు పరిధిలోకి వెళ్లింది. దీనికి సమాధానం ఇవ్వాలని హైకోర్టు కోరగా.. వార్డులను పునర్ విభజించాల్సి ఉందని, కనీసం మరో ఏడాది సమయమైనా కావాలని సర్కారు హైకోర్టును కోరింది. దీనికి ఒప్పుకోని హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్31లోపు వార్డుల పునర్‌విభజన పూర్తి చేసి డిసెంబర్ 16న ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ మధ్య టీడీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేల చేరికతో జీహెచ్‌ఎంసీ పరిధిలో టీఆర్‌ఎస్ కూడా బలం పుంజుకుంది. ఇంకా ఎన్నికలకు 8 నెలల సమయం ఉండటంతో పార్టీని మరింత పటిష్టపర్చడానికి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తు కుదిరితే సమరం సింగిల్‌పక్షంవైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయి. పొత్తు కుదరకపోతే మాత్రం టీఆర్‌ఎస్, ఎంఐఎం, బీజేపీల మధ్య హోరాహోరీ తప్పకపోవచ్చు.