ప్రత్యేక తెలంగాణ కోసం ఆవిర్భవించిన పార్టీ ‘‘టిఆర్‌ఎస్’’. అటువంటి టిఆర్‌ఎస్‌తో ఎన్నికలపొత్తు పెట్టుకోవడమే కాక గులాబీ కండువా కూడా వేసుకున్న కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాగాంధీ. రాష్ట్ర విభజన వలన ఆంధ్రాలో కాంగ్రెసు పార్టీ మట్టిగొట్టుకుపోతుందని తెలిసినా ఇచ్చిన మాటకోసం, పార్టీ విశ్వసనీయతకోసం పట్టుబట్టి రాష్ట్ర విభజన చేపట్టింది సోనియా. తెలంగాణ తెచ్చిన పార్టీగా టిఆర్‌ఎస్ అధికారానికి వచ్చింది. అటు ఆంధ్ర ఇటు తెలంగాణలో కాంగ్రెసు పార్టీ దెబ్బతిన్నది. అయినా ఇచ్చినమాటపై నిలబడే నాయకురాలిగా సోనియా నిలిచింది. రాజకీయ లబ్ధికోసం కాక విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనం మా నాయకురాలు సోనియా అని కాంగ్రెసు వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇదే సందర్భంలో అటు పంజాబ్‌లో అకాలీదళ్‌ని, ఇటు మహారాష్ట్రలో శివసేనని మిత్రపక్షాలనూ కబళించాలని చూసిన మోదీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో చెప్పిందొకటి అధికారానికి వచ్చిన తర్వాత చేసేది వేరొకటి అంటూ మోదీ, వెంకయ్యనాయుడు విశ్వసనీయతని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెసు నాయకులు. కాంగ్రెసు వారి సవాళ్ళకు సమాధానం బీహార్ ఎన్నికల తర్వాతే అంటున్నాయి బిజెపి వర్గాలు.
- తోటకూర రఘు