ఆంధ్రా - తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేకహోదా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో వుందని, సరైన సమయంలో సముచితమైన నిర్ణయం తీసుకుంటామని ‘కేంద్ర ప్రభుత్వం’ వివరణ ఇచ్చింది. రాష్ట్ర విభజన బిల్లులో ఈ ప్రత్యేక హోదా చేర్చనందున సమస్య జఠిలమయిందని పేర్కొన్నది.
ఇరు రాష్ట్రాలకు పదేళ్ళపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని విభజన బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఇరు రాష్ట్రాలు వాహనాల ఎంట్రీటాక్సు విధించాయి. ఇంటర్ పరీక్షలు, ఎంసెట్ పరీక్షలు వేర్వేరుగా జరుపుతున్నాయి. హైదరాబాదులోని ఆంధ్రా ప్రభుత్వ కార్యాలయాలున్న ఆస్తులపై, మంత్రుల అధికారుల ఇళ్ళపై మునిసిపల్ పన్ను విధిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇరు రాష్ట్రాల ప్రజలు, వాహనాల రాకపోకలపైన, హైదరాబాదులోని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వినియోగంపైన విభజన బిల్లులో స్పష్టతవున్నా ఈ తకరారు ఏమిటో అర్ధం కాదు.
అసలు రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తూ విభజన బిల్లు పార్లమెంటు ఆమోదానికి ముందే రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. సరైన సమయంలో జోక్యం చేసుకుంటాం అని సుప్రీం కోర్టు పేర్కొన్నది.
ఇంతకీ ‘సరైన సమయం’ అన్న దానికి అర్ధమేమిటి? ఆ సమయం ఎప్పుడు వస్తుందోమరి, చూద్దాం. విభజన బిల్లు పార్లమెంటుకి వచ్చినప్పుడు ప్రతిపక్ష స్ధానంలో వున్న బిజెపికి ఆ బిల్లులోని లొసుగులు తెలియవా... అలాగే ప్రత్యేక హోదా పదేళ్ళు కావాలని రాజ్యసభలో డిమాండు చేసిన వెంకయ్య నాయుడు ఇప్పుడేమో నేను కేంద్రమంత్రిని, కర్ణాటక ఎంపీని అని సన్నాయి నొక్కులు నొక్కడంలో ఆంతర్యమేమిటో అర్ధంకావడంలేదు.
- తోటకూర రఘు