'విభనతో ఏపీ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. రాష్ట్రాన్ని పునర్ నిర్మించాలంటే ఒక అనుభవజ్ఞుడి అవసరం ఉంది. అలాగే రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు భారీగా రాబట్టాల్సి ఉంటుంది. అందుకే నేను బీజేపీ, టీడీపీలకు మద్దతు పలుకుతున్నాను. మీరు కూడా ఆ రెండు పార్టీలకే ఓటు వేయ్యండి' ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాటను మార్చారు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్. ఎన్నికల్లో వైసీపీ సునాయసంగా గెలుస్తుందనుకున్న సమయంలో పవన్ ఎంట్రీతో అటు టీడీపీ.. ఇటు బీజేపీలు బలపడ్డాయి. ఇక తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రావడం లేదని, కేవలం ప్రశ్నించడానికే వస్తున్నానని పవన్ ఎలుతెత్తిచాటారు. ఇక ఇప్పుడు ఆయనకు ఏపీ ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై కూడా ప్రశ్నించే సమయం లేనట్లు కనబడుతోంది.
రాజధాని కోల్పోయి తీవ్ర ఆవేదనలో ఉన్న ఏపీ ప్రజలను ప్రత్యేక హోదా పేరుతో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్‌లు కూడా ఓదార్చడానికి ప్రయత్నించాయి. ఇక పవన్, బాబు, మోడీల ప్రచారంతో రాష్ట్ర ప్రజలూ ఆ రెండు పార్టీలనే గెలిపించారు. ఆ తర్వాత కేంద్రంలో ఉన్న మోడీ సర్కారుకు ఆంధ్రప్రదేశ్ చులకనగా మారింది. రాష్ట్ర అభివృద్ధికి నిధుల కేటాయింపు కాదు కదా.. ప్రత్యేక హోదాపై కూడా కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. దీనిపై నిలదీసి కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు రావాల్సిన చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటానికే ఇష్టపడటం లేదు. బీజేపీకి తాను దూరమైతే జగన్ దూరిపోతాడన్న ఆందోళన చంద్రబాబు ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక అదేసమయంలో జగన్‌కూడా మోడీని ప్రసన్నం చేసుకోవడానికే పరిమితం కావడంతో ప్రతిపక్షం కూడా కేంద్రాన్ని నిలదీస్తుందన్నన నమ్మకం లేకుండాపోయింది. అదే సమయంలో ప్రశ్నించడానికే వస్తానన్న పవన్‌కు ప్రత్యేక హోదాపై ప్రశ్నలే కరువయ్యాయి. చివరి క్షణాల్లో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలను మార్చిన పవన్ ఇప్పుడు ఎందుకు కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారనేది అర్థంకాని బేతాళ ప్రశ్నే. మరి ఆయన కూడా బాబు, జగన్‌ల మాదిరే కేంద్రంనుంచి ఏదైనా ఆశిస్తున్నాడా..?.