అతితెలివికిపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో. ఎంట్రీట్యాక్స్ పేరుతో ఇప్పటికే ఏపీకి షాకినిచ్చిన తెలంగాణ సర్కారు మరోమారు బాబు ప్రభుత్వానికి చుక్కలు చూపించబోయి బొక్కబోర్లా పడింది. విషయానికి వెళ్తే హైదరాబాద్ నగరంలోని పలు భవనాలను ప్రస్తుతం ఏపీ సర్కారు వాడుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ భవనాలకు పన్ను చెల్లించాలని తెలంగాణ సర్కారు ఏపీకి నోటీసులు ఇచ్చింది. అయితే విభజన చట్టం ప్రకారం ఈ భవనాలను తమకు కేటాయించారని, పదేళ్ల వరకు తాము పన్ను కట్టవలిసిన అవసరం లేదని ఏపీ సర్కారు చెబుతోంది. అంతేకాకుండా కావాలంటే తాము పన్ను కూడా చెల్లించడానికి సిద్ధమని, అయితే దీనికి ఓ షరతు ఉందని చెబుతోంది.
సాధారణంగా భవనాల ట్యాక్స్‌లను వాటి యజమానులే చెల్లిస్తుంటారు. ఈ లెక్కన ఇప్పుడు ఏపీ సర్కారు ట్యాక్స్ చెల్లిస్తే ఆ భవనాలు ఏపీ ప్రభుత్వం సొంతమని తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంటుందా అనే సమస్య తలెత్తుతుంది. ఒకవేళ ఆ భవనాల్లో ఏపీ సర్కారు అద్దెకుందని టీ-ప్రభుత్వం వాదిస్తే అందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలను చూపించమనే అవకాశముంది. అడుగడుగునా విభజన చట్టాలను ఉల్లంఘిస్తున్న టీ-సర్కారు ఈ భవనాలకు పన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేసి ఏపీకి షాకినిచ్చింది. ఇప్పుడు ఏపీ వాదనలతో టీ-సర్కారు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది.