మీడియాకి హై బడ్జెట్ నిర్మాతలు, నటీనటులు సహకరించాలి!
చిత్ర నిర్మాణ వ్యయాన్ని అదుపులో పెట్టే ప్రయత్నంగా మీడియాకు ఇచ్చే ప్రకటనల సైజుని కుదించారు, సినిమా పత్రికల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు, సినీసైట్లను పక్కనపెడుతున్నారు. తమ సినిమా వార్తలు, ఫొటోలు, క్లిప్పింగ్స్ ఇవ్వడమే పెద్ద వరంగా పోజిస్తున్నారు. ఎన్టీఆర్, అక్కినేని, శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి వరకు సినీ పాత్రికేయులను యూనిట్ సభ్యులుగా గౌరవించేవారు, తమ కుటుంబ సభ్యులవలె తమ ఇళ్ళలో జరిగే విందులకు ఆహ్వానించేవారు. సినిమా ఫస్ట్ కాపీ రాగానే చూపించి సలహాలు తీసుకున్న సందర్భాలెన్నో. ఈ సంబంధ బాంధవ్యాలవల్లనే తెలుగు సినిమాకి పత్రికా రంగానికి నడుమ ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొన్నది. హిందీ, తమిళ పత్రికలు ‘గాసిప్’ ప్రచురించినా తెలుగు పత్రికా రంగం లక్ష్మ్షణ రేఖ దాటలేదు. పత్రికా ప్రకటనలకు అయ్యే ఖర్చుని సినిమా బడ్జెట్‌లో చేర్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. గుప్పెడు మూసినంత కాలమే ఆసక్తి. గుప్పెడు తెరిస్తే అంతా బహిరంగమే. ‘మా’ ఎన్నికలు జరిగిన తీరు బాధాకరం. నటీనట సాంకేతిక వర్గం పారితోషికాలు కోట్లను చేరిన నేపధ్యంలో మీడియా పట్ల వివక్ష ప్రదర్శించడం సబబుకాదు. అందునా కొన్ని మీడియా హౌస్‌ల పట్ల సవతి తల్లిప్రేమ కనబర్చడం సమర్ధనీయంకాదు.
ఎన్నికల ముందు ‘జగన్ అధికారానికి వస్తే - అంటూ ప్రజలలో అనుమానపు బీజాలు నాటింది, ‘నవ్యాంధ్ర నిర్మాతకి క్లీన్ ఇమేజ్, విశ్వసనీయత వుండాలి’ అంటూ చంద్రబాబుకి పరోక్షంగా పబ్లిసిటీ ఇచ్చిందీ ఈ మీడియానే అన్న సంగతి మర్చిపోగూడదు.
అగ్రహీరోల చిత్రాలను కొని, ప్రదర్శించిన బయ్యర్లు, ఎగ్జిబిటార్స్ ఎవరెవరు ఎంతెంత నష్టపోయిందీ, ఆత్మహత్యకు సిద్ధమయిందీ కథలు కథలుగా చెప్పవచ్చు. అలా చెప్పకపోవడం తెలుగు పత్రికా రంగం సంస్కారం, చేతగానితనం కాదు. అగ్గిపుల్ల తల చిన్నదేనని గమనించాలి.
- తోటకూర రఘు