దేవినేని నెహ్రూ ధీటుగా స్పందిస్తారా, కంటితుడుపు ప్రకటనలతో సరిపెడతారా..!
‘భూసేకరణ’ మోదీ తలపెట్టిన భూ యజ్ఞాన్ని నిరసిస్తూ ఢల్లీిలో కాంగ్రెసు పార్టీ అతిపెద్ద సభ జరిపింది. అదే సమయంలో సిపిఎం పార్టీ విశాఖలో సమాంతరంగా సభ జరిపింది. ఇద్దరూ భూసేకరణ విషయమై రాజకీయం చేశారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు సిపిఎం టార్గెట్ అయ్యారు. ఈ సందర్భంగా కృష్ణాజిల్లా కాంగ్రెసు నాయకుడు దేవినేని రాజశేఖర్ అనబడు నెహ్రూని ఓ ప్రశ్న అడగదలిచాను. నవ్యాంధ్ర రాజధానిగా నూజివీడు, గుంటూరు పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పుడు మరియు తాజాగా నందిగామ, కంచికచర్ల వార్తలకెక్కినప్పుడు భూములు కొన్న సంస్ధలు, యజమానుల పేర్లు బయటకు తీయండి. వారు ఏ పార్టీవారో, ఏ నాయకుని అనుచరులో బహిర్గతం చేయండి. గతంలో హైదరాబాదులో హైటెక్ సిటీ, శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగు రోడ్డు ప్రతిపాదనలు కార్యరూపం దాల్చకపూర్వమే అధికార వర్గానికి అత్యంత ఆప్తులు అప్పులు జేసి మరీ భూసేకరణ జరిపినట్టు ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇప్పుడు కూడా సగటుమనిషికి అమరావతి రాజధాని అన్నది తాజావార్త. కానీ ఈ విషయం ముందుగా తెలిసిన బడాబాబులు కంచికచర్ల, నందిగామ, గుంటూరు జిల్లాలో భారీగా భూసేకరణ జరిపినట్టు భోగట్టా. బాధ్యతగల ప్రజా నాయకులుగా నెహ్రూ, అవినాష్ కొద్దిగా హోంవర్కు చేసి ఆ గుట్టు బట్టబయలు చేస్తే నిఖార్సయిన నాయకులుగా నిలబడతారు. రాజధాని స్థల ఎంపిక వెనుక జరిగిన భూ భాగోతాన్ని బయటపెట్టిన వారవుతారు.
- తోటకూర రఘు