ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ సంఘం వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. టీడీపీ ఇద్దరు ఎంపీలు గల్లా జయదేవ్, సీఎం రమేష్‌లు ఎవరికి వారే ఒలంపిక్ సంఘం అధ్యక్షులుగా చెప్పుకుంటుండటంతో ఇక విషయం కోర్టు పరిధిలోకి వెళ్లింది. ఏపీ ఒలంపిక్ సంఘం అధ్యక్షుడిగా సీఎం రమేష్‌ను ఎంపిక చేసినట్లు ఉమ్మడి రాష్ట్రాల ఒలంపిక్ సంఘం అధ్యక్షుడు లగడపాటి రాజగోపాల్ ప్రకటించడం చెల్లదని జయదేవ్ వర్గం కోర్టును ఆశ్రయించింది. దీంతో ఇదివరకే సింగిల్ జడ్జి బెంచ్ సీఎం రమేష్‌కు అనుకూలంగా ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పులో రిజన్స్ లేనందునా మళ్లీ డివిజన్ బెంచ్ తీర్పు చెప్పాలని స్పష్టం చేసింది. దీంతో గల్లా జయదేవ్ వర్గానికి ఊరట లభించింది.
మరోవైపు ఈ వివాదాన్ని పరిష్కరించడానికి చంద్రబాబు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పార్టీ క్యాడర్‌ను విస్మయానికి గురిచేస్తోంది. తనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్‌ల్లో ఒకరికి ఇప్పటికే చంద్రబాబు కేంద్రమంత్రి పదవి కట్టబెట్టారు. ఇక సీఎం రమేష్‌కు ఎలాంటి పదవి అప్పగించకపోవడంతో ఇప్పటికే ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ తరుణంలో సీఎం రమేష్‌ను వెనక్కితగ్గమని చెప్పడానికి చంద్రబాబు సాహసం చేసే అవకాశం లేదు. ఇక మరోవైపు గల్లా జయదేవ్‌తో కూడా సీఎంకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన్ను కూడా ఈ పోటీనుంచి తప్పుకోమని చంద్రబాబు చెప్పే అవకాశాలు లేవు. ఇక ప్రస్తుతం విషయం కోర్టు పరిధిలో ఉన్నందునా.. అక్కడ వారిద్దరే తేల్చుకుంటారన్న భావనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. మరోవైపు చంద్రబాబు కుమారుడు లోకేష్‌బాబు సీఎం రమేష్‌వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి అంతర్గతంగా చంద్రబాబు కూడా సీఎం రమేష్‌కే అనుకూలంగా ఉన్నట్లు విశ్లేషకుల అంచనా.