తెలంగాణలో టీడీపీ పురోగమనంలో ఉంది. ఆ పార్టీని పటిష్టపర్చడానికి చంద్రబాబు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండటం లేదు. ఒకరి వెనుక ఒకరుగా పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వలసబాట పట్టారు. అయితే ఇంకా కొందరు టీఆర్‌ఎస్‌లోకి పోవాలని చూస్తున్నా అనర్హత వేటుకు భయపడే పార్టీ మారడటం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కూడా తగిన బుద్ధి చెప్పాలని టీడీపీ నాయకులు పట్టుబట్టారు. వెంటనే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని స్పీకర్‌ను డిమాండ్ చేశారు. అయితే వీలైనంత వరకు ఈ అనర్హత వేటు సమయాన్ని పొడగించాలని ప్రభుత్వం చూస్తోంది. ఇక లాభం లేదనుకున్న తెలుగు తమ్ముళ్లు ఈ విషయమై పలుమార్లు ధర్నాలు, ఆందోళనలు కూడా చేశారు. అయినా అధికార పార్టీలో స్పందన కరువవడంతో ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో తెలుగు తమ్ముళ్లు పడిపోయారు.
ఇదే సమయంలో ఎర్రబెల్లి కొత్త చాలెంజ్‌తో టీఆర్‌ఎస్ అధినాయకుడికి సవాల్ విసిరాడు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిరిగి పోటీచేసి గెలుపొందితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించాడు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన తలసాని, తీగల, చల్లా ధర్మారెడ్డిలు తిరిగి పోటీచేసి గెలుపొందాలని సవాల్ విసిరాడు. అయితే వీరి స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే ఒక స్థానంలో టీఆర్‌ఎస్ సులభంగానే గెలుపొందుతుందని, మిగిలిన రెండు స్థానాల్లో తీవ్ర పోటీ ఉండే అవకాశముందన్న వాదనలు వినబడుతున్నాయి. ఇక పోటీ తీవ్రంగా ఉండే రెండు స్థానాల్లో ఒకదాంట్లోనైనా టీఆర్‌ఎస్ ఓడిపోతే ఎర్రబెల్లి మాట నెగ్గినట్లవుతోంది.