ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం ఎంత సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం 20 మంది తమిళనాడు వాసులను కాల్చిచంపడం ఇప్పుడు దేశవ్యాప్తంగా వేడిని పుట్టిస్తోంది. మరోవైపు ఇప్పటికే స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనాన్ని వేలం వేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఇక ఆధ్మాత్మీక యోగా గురువు బాబా రాందేవ్ ఏపీలోని 700 టన్నుల ఎర్రచందనాన్ని కొనుగోలు చేసి హరిద్వార్‌లోని పతాంజలి యోగా కేంద్రానికి తరలించినట్లు అధికారవర్గాలు వెల్లడిస్తున్నారు. ఇక దాదాపు 1150 టన్నుల ఎర్రచందనాన్ని విదేశాల్లోని సంస్థలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎర్రచందనం కొనుగోలుకు బాబా రాందేవ్ దాదాపు రూ. 200 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఎర్రచందనాన్ని ఆయుర్వేద మందుల తయారీలో వినియోగించడానికి రాందేవ్ కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఎర్రచందనం రూపంలో ఏపీ ప్రభుత్వానికి ఆదాయం కూడా భారీ స్థాయిలోనే సమకూరుతోంది.