తెలుగు సినిమా ప్రపంచ సినిమా, భారీ బడ్జెట్ సినిమా.
ఒకప్పుడు హిందీ సినిమాకి ప్రపంచ మార్కెట్ వుండేది. ఆ ఘనత సాధించిన దక్షిణాది ‘ధృవతార’ రజనీకాంత్. రాజమౌళికి ప్రపంచ మార్కెట్ వుంది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రానా హిందీ మార్కెట్ సంపాదించారు. అల్లు అర్జున్‌కి మలయాళీ మార్కెట్ వుంది. నేటితరం ‘నెటిజన్స్’ ప్రపంచ సినిమాని నెట్‌లో చూడటానికి అలవాటుపడ్డారు. వారికి టెక్నాలజీ, మ్యూజిక్ కావాలి. హాలీవుడ్ చిత్రాల స్ధాయిలో వుంటేనే వారు తెలుగు సినిమాని చూస్తారు. ప్రపంచమంతటా ఒకేసారి తెలుగు సినిమా విడుదలవుతోంది. విడుదలయిన మొదటి రెండు వారాల్లోనే పెట్టుబడి తిరిగి రావాలి. ఈ రోజున థియేటర్ కలెక్షన్స్‌తోపాటు శాటిలైట్, నెట్, కాలర్ ట్యూన్స్ వగైరా వగైరా రూపాలలో నిర్మాతకు ఆదాయం లభిస్తుంది.
పూర్వం ఒక సినిమా 100 రోజులలో వసూలు చేసిన మొత్తం ఇప్పుడు మొదటివారంలో వస్తోంది. హీరో స్టార్‌డమ్ ఓపెనింగ్స్‌కి ఉపయోగపడుతోంది. హీరో - దర్శకుడు - హీరోయిన్‌ని చూసే బిజినెస్ అవుతోంది. హీరో పిక్చరుకి మొదటివారం హౌస్‌ఫుల్, సినిమా బాగుంటే కంటిన్యూ అవుతుంది. లేకుంటే పడిపోతుంది. అదే లో-బడ్జెట్ సినిమా అయితే మొదటి వారం డల్‌గా కనిపిస్తుంది. రెండో వారంలో అందుకుంటుంది సినిమా బాగుంటే. హై బడ్జెట్ హీరో సినిమాకి, లో బడ్జెట్ సినిమాకి తేడా ఇదే.
పెద్ద హీరో సినిమాకి నిర్మాత పెద్దగా పెట్టుబడి పెట్టనవసరంలేదు. ఫైనాన్షియర్, బయ్యర్, డిస్ట్రిబ్యూటర్, శాటిలైట్ రైట్ హోల్డర్, ఆడియో వీడియో కంపెనీ అధినేత పెట్టుబడులతో సిద్ధంగా వుంటారు. అదే చిన్న నిర్మాత అయితే మొత్తం రిస్క్ తీసుకోవాలి. అందుకే నిర్మాతలు పెద్ద హీరో - దర్శకుని క్రేజీ కాంబినేషన్ కొరకు అర్రులు చాచేది. భారీ బడ్జెట్ సినిమాలు తీసేవారిని, పెద్ద హీరోలతోనే సినిమాలు తీసేవారిని విమర్శించడం సబబుకాదు. సినిమా అనేది కోట్లాది రూపాయలతో సాగే బిగ్ బిజినెస్. ఈ రోజున విడుదలకు నోచుకోని లో-బడ్జెట్ సినిమాల సంఖ్య చూస్తే విమర్శకుల నోళ్ళు మూతపడటం ఖాయం.
- తోటకూర రఘు