తెలుగు సినిమా హీరో అంటే ఎన్టీఆర్ వలె ఆజానుబాహుడు, అరవిందాక్షుడు, అందగాడు అయివుండాలా లేక అక్కినేని వలె పీలగా కోలమొహం, లోతైన కళ్ళు, బిక్కబోయిన కంఠస్వరంతో వుండాలా లేక రాజబాబులా, రాజేంద్రప్రసాద్‌లా, అల్లరి నరేష్‌లా, నవ్వుల నగేష్‌లా వుండాలా? వీరందర్నీ మించి అమితాబ్ ఆలిండియా సూపర్ స్టార్ అవుతాడని, రజనీకాంత్ బాక్సాఫీసు కింగ్ అవుతాడని ఎవరైనా ఊహించారా?
ఏ నిర్మాణానికయినా సింహద్వారం వుంటుంది, అదే మెయిన్ ఎంట్రెన్స్. కానీ సినిమా పరిశ్రమలోకి అన్నీ ఎంట్రీలే. ఏ రోజున ఎవరు ఏ వైపు నుంచి ఎంట్రీ ఇస్తారో ఎవరికీ తెలియదు. ఎన్టీఆర్, అక్కినేని, శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణం రాజు, మోహన్‌బాబు, కమలహాసన్, రజనీకాంత్, చిరంజీవి స్వయంకృషితో సినీ పరిశ్రమలో స్థానం సంపాదించినవారే. దాసరి, రాఘవేంద్రరావు, విబి రాజేంద్రప్రసాద్, వడ్డే రమేష్, ఎమ్మెస్‌రాజు, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, బాబూమోహన్, కెఎస్ రామారావు వంటి సినీ దిగ్గజాలు తమ వారసులను హీరోలుగా పరిచయం చేశారు గాని వారు హీరోలుగా స్థిరపడలేదు.
ఎవరో ఎందుకు హీరో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌బాబు, గిరిబాబు పెద్ద కుమారుడు, ఇవివి పెద్ద కుమారుడు ఆర్యన్ రాజేష్ మరియు నందమూరి వంశీయులలో ఎందరు హీరోలుగా రాణించారో లెక్కించండి. సినిమా సక్సెస్‌కి ఫార్ములా లేదు, సినీ హీరోకి నిర్దిష్టమైన క్వాలిఫికేషన్సు లేవు. చంద్రమోహన్, మురళీమోహన్, విజయచందర్, నరశింహరాజు, ఈశ్వరరావు, రాజా ఇలా ఎందరెందరో. డాక్టరు కుమారుడు డాక్టరు కాగా లేనిది సినిమా వారి పిల్లలు సినిమా రంగాన్ని వృత్తిగా ఎంచుకోవడంలో తప్పులేదు. గవాస్కర్ కొడుకు రోహన్ గవాస్కర్ క్రికెటర్‌గా రాణించలేదు. అంతమాత్రాన వారిని విమర్శించలేం. సావిత్రి, వాణిశ్రీ, శారద, హేమమాలిని వంటివారు తొలి దినాలలో చిన్న చిన్న పాత్రలు పోషించిన వారే.
-తోటకూర రఘు