కెప్టెన్‌గా ఇండియా జట్టుకు వరుస విజయాలు అందించి కొత్త ఒరవడి సృష్టించిన సౌరవ్ గంగూలీ మళ్లీ భారతీయ జట్టుకు సేవలందించడానికి సిద్ధమవుతున్నాడు. అన్ని కలిసి వస్తే సౌరవ్ భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సౌరవ్‌కు ఇండియా క్రికెట్ జట్టు కోచ్‌గా రావాలన్న ఆసక్తి ఉందని కొన్ని రోజులుగా కథనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో గంగూలీ గురువారం బీసీసీఐ చైర్మన్ దాల్మియాను కలిసి కోచ్ పదవి గురించి చర్చించినట్లు సమాచారం. గతంలో గంగూలీకి కెప్టెన్సీ దక్కడంలో కూడా దాల్మియా కీలకపాత్ర పోషించారు. దీంతో ఈసారి కూడా ఆయన గంగూలీకి కోచ్‌గా అవకాశమిస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే ధోనీ మాత్రం ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకల్ హస్సీని కోచ్‌గా నియమించాలని బోర్డును కోరినట్లు సమాచారం. ఇక ఈసారికి కోచ్‌గా స్వదేశీ ఆటగాడికే అవకాశం ఇవ్వాలని బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కోచ్ రేసులో గంగూలీతోపాటు హైదరాబాద్‌కు చెందిన శ్రీధర్ తదితరులు పోటీలు ఉన్నారు. అదే సమయంలో రవిశాస్త్రీ స్థానంలో ఇండియాకు కొత్త మేనేజర్‌ను కూడా నియమించాలని బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రవిశాస్త్రీ స్థానంలో మిస్టర్ పర్‌ఫెక్ట్ ద్రవిడ్‌ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు గంగూలీ కెప్టెన్‌గా ద్రవిడ్ వైస్ కెప్టెన్‌గా భారత్‌కు చిరస్మరణీయ విజయాలు అందించారు. ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే మరోసారి కూడా వారిద్దరూ కలిసి భారత్‌కు మరుపురాని విజయాలు అందించే అవకాశం ఉంది.