తెలంగాణ సరికొత్త రాష్ట్రం. దేశంలో రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెబుతుందని ఆశిస్తే మళ్లీ నిరాశే ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దాదాపు 7 దశాబ్దాలు కావస్తోంది. అప్పటికీ ఇప్పటికీ దేశ స్థితిగతుల్లో అనేక మార్పులు వచ్చినా రాజకీయాల్లో మాత్రం ఓ ఒరవడి దశాబ్దాలుగా కొనసాగుతోంది. నాయకుడి కడుపులో పుట్టడమే ప్రధాన అర్హతగా రాజకీయాల్లో వారసత్వాలు కొనసాగుతున్నాయి. అందుకే పోటీలేకుండా దేశాన్ని నెహ్రూ వారసులు దాదాపు 55 ఏళ్లకు పైగా పాలించారు. ఇక దాదాపు రెండు నెలలుగా దేశంలో పత్తాలేకుండా పోయిన రాహుల్‌గాంధీ కోసం యావత్ కాంగ్రెస్ దళం ఎప్పుడువస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆయన రాగానే కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాను రాహుల్‌కు కట్టబెట్టడానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు దశాబ్ద కాలంగా ఆయన దేశ రాజకీయాల్లో కొనసాగుతున్నా ఇప్పటికీ సాధించేదేమీ లేదు. అయినా అధిష్టానం మెప్పు పొందడానికి వారి వారసులను వేన్నోళ్ల పొగుడుతూ పబ్బం గడుపుకోవడానికి చూస్తున్న దిగ్విజయ్‌సింగ్‌లాంటి నాయకులున్నంత కాలం దేశానికి వారసత్వ ముప్పు తప్పదు.
ఇక తెలంగాణ విషయానికొస్తే .. టీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం అంతర్గతంగా వారసత్వ పోరు కొనసాగుతోంది. కేసీఆర్ అల్లుడిగా రాజకీయాంరగేట్రం చేసిన హరీష్‌రావు ఇప్పుడు గులాబి దళంలో తనకంటూ సుస్థిర స్థానాన్ని, అనుచరగణాన్ని తయారుచేసుకున్నారు. ఇక కేసీఆర్ వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన కేటీఆర్‌కు ఇది ఏమాత్రం రుచించని విషయమే. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మూడు వర్గాలుగా విడిపోయారు. కొందరు కేటీఆర్ వర్గంలో, మరికొందరు హరీష్‌రావు వర్గంలో, మిగిలినవారు తటస్థంగా కొనసాగుతున్నారు. ఇక ఇదే సమయంలో ఈ అంతర్గత పోరుకు చెక్ పెట్టడానికి కేసీఆర్ రంగంలోకి దిగారు. కేటీఆరే తన వారసుడని చెప్పకనే చెప్పి వారసత్వ పోరు లేకుండా ఎత్తులు వేస్తున్నారు. అందుకే పార్టీ మీద కేటీఆర్‌కు పూర్తి ఆధిపత్యం అప్పగించడానికి ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అప్పజెప్పడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీస్థాయిలో ఈసారి జరగనున్న పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం జరిగిపోవచ్చని అంచనా. ఇక దేశంలో గాంధీ ఫ్యామిలీ సాధించిన విధంగానే రాష్ట్రంలో కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ వారసత్వ రాజకీయాలు కొనసాగునున్నాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.