కమర్షియల్, కామెడీ సినిమా అనే తేడా లేదు. ప్రతి సినిమాలో బ్రహ్మానందం వినోదం పండించాలి. హీరో ఎంత పెద్ద స్టారయినా సినిమాలో బ్రాహ్మి లేకపోతే ప్రేక్షకులకు వెలితిగా ఉండేది. 2014లో మొత్తంగా 18 సినిమాల్లో సందడి చేసిన బ్రహ్మానందం.. 'ఎవడు', 'హార్ట్ ఎటాక్', 'రేసు గుర్రం', 'పవర్' చిత్రాలు విజయాలు సాదించడంలో కీ రోల్ ప్లే చేశారు. ఈ ఏడాది మాత్రం బ్రాహ్మి జోరు తగ్గింది. 'సన్నాఫ్ సత్యమూర్తి' మినహిస్తే ఒక్క పెద్ద సినిమాలో కూడా కనిపించలేదు. ఆ లోటు త్వరలో తీర్చనున్నాడు హాస్య బ్రహ్మ. విడుదలకు సిద్దంగా ఉన్న యువ హీరోల సినిమాల్లో కామెడీ పండించే భాద్యతను బ్రహ్మానందం తన భుజాలపై వేసుకున్నాడు. దర్శకులు, హీరోలు కూడా బ్రాహ్మిపై చాలా ఆశలు పెట్టుకున్నారు.
'దోచేయ్'లో బుల్లెట్ బాబు :
నాగ చైతన్య, కృతి సనన్ జంటగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'దోచేయ్'లో బుల్లెట్ బాబుగా బ్రాహ్మి నటించారు. తెలుగు సినిమా హీరోగా ఓ రేంజ్లో వినోదం పండించాడట. ఇప్పటికే ట్రైలర్లో బ్రాహ్మి చెప్పిన డైలాగులు పాపులర్ అయ్యాయి. సినీ ఇండస్ట్రీపై బ్రాహ్మి చేత దర్శకుడు ఎలాంటి సెటైర్లు వేయించాడో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
'పండగ చేస్కో'లో వీకెండ్ వెంకట్రావ్ :
రామ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'పండగ చేస్కో'లో వీకెండ్ వెంకట్రావ్ గా సందడి చేయనున్నాడు. అనేక సినిమాల్లో బ్రహ్మానందం చేత వింత వేషాలు వేయించి, ప్రేక్షకుల కడుపు చెక్కలయ్యేలా నవ్వించిన ప్రముఖ రచయిత కోన వెంకట్ సృష్టించిన హాస్య పాత్ర ఇది. కోన వెంకట్ మార్క్ డైలాగులు, బ్రాహ్మి నటన ప్రేక్షకులకు ఫుల్లుగా వినోదం అందించడం ఖాయమని చిత్ర బృందం చెప్తుంది.
'దొంగాట'లో డిటెక్టివ్..? :
మంచు లక్ష్మి, అడవి శేష్ ప్రధాన పాత్రధారులుగా కొత్త దర్శకుడు వంశీకృష్ణ తెరకెక్కించిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'దొంగాట'. ట్రైలర్ లో బ్రాహ్మి స్క్రీన్ స్పేస్, దర్శకుడు కల్పించిన ఇంపార్టెన్స్ చూస్తుంటే సినిమాలో ఎ రేంజ్లో రేచ్చిపోయాడో అర్ధం చేసుకోవచ్చు. మాన్ ఆన్ ఫైర్ అంటూ వింత వింత హావభావలు, చేష్టలతో ట్రైలర్ చూసిన ప్రేక్షకులకు కిక్ ఎక్కించాడు.
త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూడు సినిమాలు మాత్రమే కాదు, చిత్రీకరణలో ఉన్న పలు సినిమాలలో ప్రాముఖ్యత గల పాత్రలు పోషిస్తున్నాడు. మహేష్ బాబు 'శ్రీమంతుడు', అఖిల్ - వినాయక్ మూవీలతో పాటు ఇతర సినిమాల్లో నటిస్తున్నాడు. వేసవిలో మొదలయ్యే బ్రాహ్మి వినోదపు జల్లులు ఏడాది చివరి వరకు కొనసాగాలని అభిమానులు కోరుతున్నారు.