ఇటీవలే మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. మల్టీప్లెక్స్‌ల్లో సాయంత్రం 6 గంటల నుంచి 9గంటల వరకు కేవలం మరాఠి చిత్రాలనే ప్రదర్శించాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ఇక జనాలు సాధారణంగా సాయంత్ర వేళ సినిమాలను చూడటానికే ఇష్టపడతారు. ఈ తరుణంలో ప్రజల్లో అధిక భాగం మంది మరాఠి చిత్రాలను చూస్తారని ప్రభుత్వం భావించి ఉండవచ్చు. ఈ నిబంధనను శివసేన, బీజేపీలు మినహాయించి అన్నిపార్టీలు వ్యతిరేకించాయి. దీనిపై ప్రముఖ రచయిత్రి శోభాడే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు శివసేన పార్టీని అగ్గిమీద గుగ్గిలం చేశాయి. ఈ లెక్కన సినిమా హాళ్లలో పాప్‌కార్న్ బదులు దహీవడా అమ్ముతారా అంటూ ఆమె ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. అలాగే బాల్‌థాకరేను గుర్తుకుతెచ్చేలా ఇది బలవంతపు దాదాగిరిలా ఉందని పోస్టు చేసింది. దీంతో శివసేన కార్యకర్తలు శోభాడే ఇంటి ఎదుట ఆందోళనకు దిగాయి. ఇక తప్పని పరిస్థితుల్లో పోలీసులు ఆమెకు భారీ భద్రతను ఏర్పాటుచేశారు. అలాగే ప్రభుత్వ నిబంధనపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో ప్రభుత్వం కూడా కాస్త వెనక్కితగ్గింది. మధ్యాహ్నం 12 గంటలనుంచి రాత్రి 9గంటలలోపు ఏదైనా ఓ షోలో మరాఠి చిత్రాన్ని ప్రదర్శించాలని నిబంధనను సడలించింది. మరోవైపు శోభాడే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడానికి అంగీకరించలేదు. మొత్తానికి శోభాడే వ్యవహారం ప్రభుత్వంలో కొంత కదలిక తెచ్చిందని చెప్పవచ్చు.