చంద్రబాబు టీటీడీ చైర్నన్ పోస్టులో ఎవర్ని కూర్చోబెడతారోన్న ఆసక్తి చాలా రోజులుగా రాజకీయవర్గాల్లో కొనసాగుతోంది. క్యాబినెట్ మంత్రి హోదా ఉన్న ఈ పోస్టు కోసం చాలామంది పోటీకూడా పడ్డారు. ఎట్టకేలకు ఈ సీట్లో చదలవాడ కృష్ణమూర్తిని వరించింది. గత ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో బాగంగా టీడీపీ నుంచి కృష్ణమూర్తికి టికెట్ దక్కలేదు. అప్పుడు అసంతృప్తితో ఉన్న చదలవాడను ప్రభుత్వంలోకి వస్తే టీటీడీ చైర్మన్ పోస్టు కేటాయిస్తానని చెప్పి చంద్రబాబు చల్లబర్చారు. అయితే ఎన్నికల తర్వాత ఈ సీటు కోసం పోటీ తీవ్రతరం కావడంతో చదలవాడకు టీటీడీ చైర్మన్ దక్కుతుందో లేదోనన్న కథనాలు వెలువడ్డాయి. ఇక ఇచ్చిన మాట మేరకు బాబు చదలవాడకే ఈ పోస్టును కేటాయించారు.
టీటీడీకి మొత్తం 18 మంది సభ్యుల బోర్డును ఏపీ ప్రభుత్వం కేటాయించింది. టీటీడీ చైర్మన్‌గా చదలవాడ కృష్ణమూర్తిని నియమించగా.. ఇక తెలంగాణ నుంచి కూడా ముగ్గురికి బోర్డులో సభ్యత్వం కల్పించింది. వీరిలో సండ్ర వెంకట వీరయ్య(టీడీపీ), సాయన్న(టీడీపీ), చింతలరామచంద్రారెడ్డి(బీజేపీ)లు ఉన్నారు. అలాగే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కూడా బోర్డులో ప్రాతినిధ్యం కల్పించారు.