చనిపోయింది ఎవరయినాసరే, ‘పాజిటివ్’ దృక్పధంతో వారి గురించి మాట్లాడుకుంటాం. శేషాచలం అడవులలో ప్రాణాలు కోల్పోయిన తమిళ సోదరుల గురించి భిన్న పత్రికలు భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. భావోద్వేగాలతో కూడివున్న ఈ విషయమై ఒక్కో పత్రికది ఒక్కో పంధా. ఇదే సందర్భంలో కొన్ని సంస్థలు, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కొన్ని పార్టీలు బోగస్ ఎన్‌కౌంటర్ అని మండిపడుతున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారం కొత్తదికాదు. ఎప్పట్నుంచో జరుగుతోంది. అటవీ సిబ్బందిపైన, పోలీసు అధికారులపైన దాడులు జరిగాయి. అడవులను తగులబెట్టారు. భర్తలను కోల్పోయిన భార్యలు, తండ్రులను కోల్పోయిన బిడ్డలు, బిడ్డలను కోల్పోయిన తల్లులు ఎందరెందరో.
ఈ ఎర్రచందనం చెట్ల అక్రమ నరికివేతలో కూలీలు ప్రాణాలకు తెగిస్తున్నారని, చట్టానికి చిక్కితే జైలు జీవితమేనని ఈ రాజకీయ పార్టీలలో ఏ ఒక్క రాజకీయ పార్టీ, ఏ స్వచ్ఛంద సంస్ధా, ఏ ఒక్క పత్రికా ఎందుకు కూలీలలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదన్నదే మా ఆవేదన. ఇంతకాలం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుని ఇప్పుడు శవ రాజకీయం చేయడం సమంజసమా అని ప్రశ్నిస్తున్నాం. వార్తకి సంపాదకీయానికి తేడా వుంది. జరిగింది జరిగినట్లు రిపోర్టు చేయడమేవార్త. కానీ వార్తా పత్రికలలో ఒకే వార్త ఎన్ని షేడ్స్ పులుముకుంటుందో చూస్తుంటే పత్రికా రంగంపట్ల వున్న గౌరవం, నమ్మకం ప్రశ్నార్ధకమవుతోంది.