'సత్యం' కుంభకోణం కేసులో రామలింగరాజుసహా పదిమంది దోషులకు కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష, పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. 104, 108 వంటి సేవలను అందుబాటులోకి తెచ్చి లక్షలాది మంది ప్రాణాలను కాపాడానని, శిక్షను తగ్గించాలని రామలింగరాజు చేసిన విజ్ఞప్తిని కూడా కోర్టు పట్టించుకోలేదు. దేశ ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం చూపే నేరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించేది లేదని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్య ఇప్పుడు వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. జగన్‌పై ఉన్న అన్ని కేసులు కూడా ఆర్థిక నేరానికి సంబంధించినవే. ఈ లెక్కన జగన్‌కు కూడా ఏడేళ్ల జైలు శిక్ష పడితే ప్రతిపక్షంలో ఉన్న తమ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుందని వారు ఆందోళనకు గురవుతున్నారు.
సత్యం రామలింగరాజుకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. దీంతో ఆయన కేసులో దర్యాప్తు నిష్పక్షపాతంగా కొనసాగింది. కాని జగన్‌కు సంబంధించి ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉంది. దీంతో అధికారవర్గంపై ఈ కేసుకు సంబంధించి జగన్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉంటున్నది సుస్పష్టం. ఈ మధ్య జగన్ కేసుకు సంబంధించి సీబీఐ విచారణలో వేగం తగ్గినా.. ఈడీ మాత్రం వరుసగా కోట్లాది రూపాయల ఆస్తిని జప్తుచేస్తూ వెళ్తోంది. దీంతో జగన్‌కు సంబంధించిన సంస్థలు కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాయి. అంతేకాకుండా జగన్, సత్యం కేసుల్లో కూడా ఓ సారూప్యత ఉంది. ఈ రెండు కేసులకు సంబంధించి దర్యాప్తు అధికారిగా జేడీ లక్ష్మీనారాయణే ఉన్నారు. అప్పట్లో సీబీఐ డీఐజీగా ఉన్న లక్ష్మీనారాయణ దర్యాప్తు జరిపిన సత్యం కేసులో రామలింగరాజుకు జైలు శిక్షపడటంతో ఇక జగన్ కూడా జైలు ఊచలు లెక్కబెట్టక తప్పదని టీడీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు.