తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడంలో టీడీపీ నాయకులు ముందుంటారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెసే అయినప్పటికీ మీడియాలో వారికంటే కూడా వీరి హడావుడే ఎక్కువగా ఉంటుంది. అయితే రాష్ట్రంలో సంచలనంగా మారిన వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి మాత్రం వీరు సైలెంట్‌గా మారిపోయారు. మీడియా ముందు ప్రభుత్వాన్ని విమర్శించడానికి దొరికే ఏ అవకాశాన్ని కూడా టీడీపీ నాయకులు వదిలిపెట్టరు. అయితే ఈ సంఘటనపై మాత్రం వారు నోరు మెదపకపోవడం సామాన్యులను విస్మయానికి గురిచేస్తోంది.
సాధారణంగా అయితే ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అంటూ సీబీఐ విచారణకు డిమాండ్‌చేసేవారు. అయితే ఏపీలో పోలీసుల కాల్పుల్లో ఏకంగా 20 మంది మృత్యువాతపడ్డారు. శేషాచలం సంఘటన బూటకపు ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో తెలంగాణలోని బూటకపు ఎన్‌కౌంటర్ అంటే మరి ఏపీ సంగతిపై కూడా వారు స్పందించాల్సి ఉంది. పోని వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్లవుతుంది. దీంతో వారు ఈ సంఘటనపై స్పందించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. 'తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ' అన్న పద్యాన్ని టీడీపీ నాయకులు బాగానే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.