కోలం గంగిరెడ్డి.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పేరుగాంచిన గంగిరెడ్డి ప్రస్తుతం మారిషస్‌లో పోలీస్ కస్టడీలో ఉన్నాడు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంవిడిచి పారిపోయిన గంగిరెడ్డిని మారిషస్‌లో ఇంటర్‌పోల్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక గంగిరెడ్డి పెట్టుకున్న బెయిల్ పిటీషన్‌ను కూడా అక్కడి కోర్టు కొట్టివేసింది. దీంతో గంగిరెడ్డిని సాధ్యమైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఈ పరిణామం వైసీపీ నాయకులకు దడపుట్టిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ఎర్రచందనం స్మగ్లింగ్‌తో వందల కోట్లు కూడబెట్టిన గంగిరెడ్డి వైఎస్ జగన్ ఫ్యామిలీకి సన్నిహితంగా మెలిగారు. అంతేకాకుండా ఆయన కుటుంబ సభ్యులు కూడా వైసీపీలో ప్రధాన నాయకులుగా కొనసాగుతున్నారు. దీనికితోడు 2014 ఎన్నికలకు ముందు వైసీసీ ఎమ్మెల్యే అభ్యర్థులకు గంగిరెడ్డి ఎన్నికల ఖర్చు కోసం కొన్ని కోట్లు ఇచ్చినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కడప జిల్లాలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల గెలుపులో గంగిరెడ్డి కీలకపాత్ర పోషించాడని రాజకీయవర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. అయితే వైసీపీ అధికారంలోకి వస్తుందని ఇవన్ని చేసిన గంగిరెడ్డి తీరా టీడీపీ ప్రభుత్వంలోకి రావడంతో దిక్కుతోచక పారిపోయి మారిషస్‌లో పట్టుబడ్డాడు. ఇప్పుడు ఆయన్ను ఏపీకి తీసుకొస్తే ఎవరెవరికి ఎంతెంత ఇచ్చింది.., స్మగ్లింగ్‌లో ఆయనతోపాటు పాలు పంచుకున్న నాయకుల పేర్లు కూడా బయటకి వస్తాయని పలువురు ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా గంగిరెడ్డి నుంచి సమాచారాన్ని రాబట్టి వైసీపీ నాయకులను ఇరుకున పెట్టాలని టీడీపీ కూడా ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గంగిరెడ్డి రాకతో ఏపీలో రాజకీయవేడి పుట్టుకొస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.