నవ్యాంధ్ర రాజధాని ‘‘అమరావతి’’ నిర్మాణానికి దలైలామా 500 కోట్లు విరాళం సేకరించి ఇస్తానన్నారన్న వార్త ఆధారంగా ఇటీవల ఓ ఉన్మత్త కథనం వెలువడిరది. హిమాచల ప్రదేశ్‌లో ఆశ్రయం పొందిన ఈ బౌద్ధ ప్రపంచ గురువు గతంలో అమరావతిలో ‘కాలచక్ర’ నిర్వహించిన విషయం విదితమే. బౌద్ధ, జైన మతాలు పరిఢవిల్లిన ఆంధ్రా ప్రాంతంలో ప్రపంచ బౌద్ధ ఆధ్యాత్మిక గురు దలైలామా ‘ఆరామం’ ఏర్పాటు చేస్తే తప్పేమిటి. ప్రపంచంలో బౌద్ధ దేశాలు చాలా వున్నాయి. టూరిజం, విద్య, వైద్యం అభివృద్ధి చెందుతాయి. భారతదేశంలో పుట్టిన బుద్ధిజానికి ఆంధ్రప్రదేశ్ ఆతిధ్యం ఇవ్వడం తప్పుకాదు. ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరూ ముస్లింలకు దర్గా, క్రిస్టియన్లకు చర్చ్ నిర్మాణానికి కోట్ల విరాళం ప్రకటించారు.
అలాగే ఎర్ర చందదనం స్మగ్లర్ల ఎన్‌కౌంటర్‌లో తమిళనాడు కూలీల మరణం సున్నితమైన అంశం. తమిళనాడులో ఎందరో తెలుగువారున్నారు. భావోద్వేగాలతో కూడుకున్న ఈ విషయమై కథనాల ప్రచురణలో సంయమనం పాటించకపోవడం శోచనీయం. రాజకీయ లబ్ధికోసం రాసే రాతలవలన తమిళనాడులోని లక్షలాది తెలుగువారు ఇబ్బంది పడకూడదు. ప్రతి అంశాన్నీ రాజకీయం చేయడం సమర్ధనీయం కాదు. ఎర్రచందనం కూలీల మరణాన్ని జీర్ణించుకోవడం కష్టమయినపుడు సంపాదకీయం రాయండి. గుండె గాయాన్ని పెద్దది చేయకండి.
-తోటకూర రఘు