శేషాచలం అడవుల్లో తమిళనాడుకు చెందిన 20 మంది కూలీల ఎన్‌కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇక తెలుగు ప్రజలంటే అగ్గిమీద గుగ్గిలమవుతున్న తమిళనాడువాసులు ఆ రాష్ట్రంలోని తెలుగువారి ఆస్తులపై దాడులకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా తుత్తుకూడి పట్టణంలోని ఆంధ్రాబ్యాంకుపై బాంబ్‌దాడి కూడా జరిగింది. ఆ సమయంలో బ్యాంకులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇక మూడు రోజులుగా ఏపీనుంచి తమిళనాడుకు బస్ సర్వీసులు కూడా ఆగిపోయాయి. ఇది పక్కా ఫేక్ ఎన్‌కౌంటరేనంటూ తమిళనాడు రాజకీయపార్టీలు వాదిస్తున్నాయి. ఏపీ పార్టీలు కూడా వారికి జత కలిసి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇక వైసీపీ అయితే ఈ సంఘటనపై చాలా హడావుడి చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తోంది.
ఇక ఒకేసారి 20 మందిని పోలీసులు హతమార్చడంతో నేషనల్ మీడియా కూడా ఈ వార్తకు చాలా ప్రాధాన్యతనిస్తుండటం ఏపీ ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. దీనికి సంబంధించి లోతైన విచారణ జరిగితే తమకు ఇబ్బందులు తప్పవన్న భావనలో పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కాల్పులకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడుకు చెందిన కృష్ణమూర్తి అనే న్యాయవాది సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ దత్తు ముందు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ కుమ్మక్కై ఈ ఫేక్ ఎన్‌కౌంటర్‌కు ప్లాన్‌చేశారన్నది ఆయన ఆరోపణ. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కృష్ణమూర్తి కోరారు. అయితే ఈ కాల్పులకు సంబంధించి పిటీషన్ దాఖలు చేస్తే సీబీఐ విచారణ గురించి ఆలోచిద్దామని చీఫ్ జస్టీస్ దత్తు స్పష్టంచేశారు. మానవహక్కుల సంఘాలుగాని లేదా తమిళనాడుక చెందిన లాయర్లుగాని ఈ కాల్పులకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడు నిజంగానే అత్యున్నత న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశిస్తే బాబు సర్కారుకు ఇబ్బందులు తప్పవేమో..!.