వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి అనుమానాలు బలపడుతున్నాయి. నిందితులపై ఎలాంటి గాయాలు లేకపోవడం, అక్కడ పెనుగులాటకు సంబంధించిన దాఖలాలు కూడా లేకపోవడంతో ఇది పక్కా ఫేక్ ఎన్‌కౌంటర్ అని అటు బాధిత కుటుంబాలతోపాటు ఎంఐఎం నాయకులు కూడా వాదిస్తున్నారు. మరి ఇది ఫేక్ ఎన్‌కౌంటర్ అయితే పోలీసులకు ఇప్పటికిప్పుడు అంత అవసరం ఏమొచ్చింది..? 2010 నుంచి కూడా వికారుద్దీన్ జైలులో ఉన్నా.. పోలీసులు ఇప్పుడే ఎందుకు ఎన్‌కౌంటర్ చేశారు..? గతంలో జైలులోనే అనేకమార్లు పోలీసులపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చినా పట్టించుకోని పోలీసులు.. ఇప్పుడు మాత్రం వికారుద్దీన్ లైఫ్‌కు ఎందుకు పులిస్టాప్ పెట్టారు..? అనే అనుమానాలు సామాన్యుల్లో తలెత్తుతున్నాయి. అయితే ఈ సంఘటనతో కేసీఆర్‌కు, వైఎస్‌ఆర్‌కు లింక్‌పెడుతున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.
2008 డిసెంబర్‌లో వరంగల్‌లో పోలీసులు ముగ్గురు యువకులను కాల్చిచంపారు. అంతకు కొన్ని రోజుల ముందే ఆ ముగ్గురు యువకులు కూడా ఓ ఇద్దరు ఈ అమ్మాయిలపై యాసిడ్ వేసిన సంఘటనలో నిందితులుగా ఉన్నారు. యాసిడ్ సంఘటనతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. ఇంకా మూడు నెలల్లో ఎన్నికలు ఉండగా.. యువతరంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నెలకొన్న ఆగ్రహం తమను దెబ్బతీస్తుందని ఆనాటి వైఎస్ సర్కారు భావించింది. అంతలోనే ఆ ముగ్గురు యువకులు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారంటూ పోలీసులు కాల్చిచంపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా యువత ముఖ్యంగా విద్యార్థినులు రోడ్లపైకి వచ్చి సంబురాలు చేసుకున్నారు. ఇక ఆ జిల్లా అప్పటి ఎస్పీ సీవీ సజ్జనర్‌ను భుజాలపైకి ఎత్తుకొని మరీ ఊరేగించారు. ఈ ఎన్‌కౌంటర్‌తో ప్రభుత్వంపై యువతలో నెలకొన్న ఆగ్రహం మటుమాయమైంది. అయితే యాసిడ్ ఘటన ఎన్నికల్లో దెబ్బతీస్తుందన్న ఆందోళనతో వైఎస్ ఆదేశాల మేరకే పోలీసులు ఆ ముగ్గుర్ని కాల్చిచంపారని విపక్షాలు విమర్శించాయి. ఆ తర్వాత ఆ విషయం గురించి పట్టించుకునే వారు కరువయ్యారు.
ఇక ఇప్పటి నల్గొండ కాల్పులకు వస్తే అంతకుముందు జరిగిన ఇద్దరు టెర్రరిస్ట్‌ల ఎన్‌కౌంటర్‌లో ఎస్‌ఐ సిద్ధయ్యతో కలుపుకొని మొత్తం నలుగురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తాయి. దీంతోనే వికారుద్దీన్ ఎన్‌కౌంటర్ చేసి తెలంగాణ సర్కారు ప్రజలకు బలమైన మెసేజ్ పంపింద్దన్న వార్తలు వెలువడుతున్నాయి. అప్పటి వైఎస్‌లాగే ఇప్పుడు కేసీఆర్ కూడా పరోక్షంగా ఈ ఫేక్ ఎన్‌కౌంటర్‌కు అనుమతినిచ్చాడని పలువురు వాదిస్తున్నారు.