'సత్యం' కుంభకోణంలో కోర్టు తీర్పు ప్రకటించింది. రామలింగరాజుసహా అభియోగాలు మోపబడ్డ పదిమంది కూడా దోషులేనని ప్రకటించింది. దాదాపు ఐదేళ్లపాటు ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. సత్యం కుంభకోణంకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 2009లో దాదాపు రూ. 14 వేల కోట్ల కుంభకోణం బయటపడింది. లేని ప్రాజెక్టు వర్క్‌లు చూపిస్తూ ఈ కంపెనీ యాజమాన్యాం బ్యాంకులనుంచి పెద్దమొత్తంలో రుణాలు పొందింది. అంతేకాకుండా షేర్ విలువ కూడా పెద్ద మొత్తానికి పెరిగేలా మోసం చేసింది. ఇక ఈ సమాచారం బయటకు రావడంతో కంపెనీ షేరు విలువ దారుణంగా పడిపోయి లక్షల మంది ఇన్వెస్టర్లు పెద్దమొత్తంలో మోసపోయారు. దీనికి సంబంధించి సీబీఐ విచారణ జరిపి సత్యంరామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు, కంపెనీ సీఎఫ్‌ఓ వడ్లమానిశ్రీనివాస్‌సహా మరో 7 మందిపై అభియోగాలు మోపింది. ఆ తర్వాత మూడేళ్లపాటు జైలులో గడిపిన రామలింగరాజు కొద్దికాలం క్రితమే బెయిల్‌పై విడుదలయ్యారు. ఇక ఈ కేసుకు సంబంధించి 2000 మంది సాక్ష్యులను విచారించిన కోర్టు, సీబీఐ సమర్పించిన 3 వేల డాక్యుమెంట్లను కూడా పరిశీలించి తుదితీర్పువెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేల్చిన పదిమందికి కూడా 7నుంచి పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశాలున్నాయి. కోర్టు విధించే శిక్షపై ఇప్పుడు వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఇక కోర్టు ఎన్నాళ్లు శిక్ష విధించినా దోషులు మళ్లీ పైకోర్టుకు వెళ్లి మరో కొన్నేళ్లపాటు కేసును సాగదీస్తారని చెప్పడానికి అనుమానం అవసరం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.