జగన్‌మోహన్‌రెడ్డి మరో యాత్రకు సిద్ధమవుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ సాగునీటి ప్రాజెక్టుల వద్దకు జగన్ తన ఎమ్మెల్యేలతో కలిసి బస్‌యాత్ర చేపట్టనున్నాడు. జగన్ యాత్ర 15న రాజమండ్రిలో ప్రారంభమై మూడురోజుల్లో పూర్తవనుంది. తన బస్సుయాత్రలో భాగంగా జగన్ ధవళేశ్వరం, పోలవరం కాలువలు, పట్టిసీమ ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీ, వెలుగొండ, బనకచర్ల క్రాస్, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా హెడ్‌రెగ్యులేటర్‌ను సందర్శిస్తారని సమాచారం.
అయితే ఈ బస్సుయాత్ర వెనుక ఉన్న అసలు ఉద్దేశం మాత్రం పట్టిసీమ ప్రాజెక్టేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టిసీమ ప్రాజెక్టును జగన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు బదులు పోలవరం ప్రాజెక్టును త్వరగా నిర్మించాలని, అలాగైతేనే రైతులకు అధిక లబ్ధి చేకూరుతుందని జగన్ వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అదేసమయంలో పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులను జగన్ కలిసి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఈ ప్రాజెక్టుపై రైతులనుంచి వ్యతిరేకత తీవ్రంగా ఉంటే ఆయన మరో ఉద్యమానికి సిద్ధమవుతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు ఆయన పోలవరం ప్రాజెక్టును కూడా సందర్శించనున్నారు. అక్కడ ప్రాజెక్టు పనుల పురోగతి గమనించి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.