లోక్‌సత్తా పార్టీకి ఈసారి ఖాతా తెరవలేకపోయింది. 2009 ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి జయప్రకాశ్ నారాయణ ఎమ్మెల్యేగా గెలవడంతో శాసనసభలో ఆ పార్టీకి ఒక్క ప్రతినిధి అయినా ఉన్నారు. ఈసారి ఎంపీగా పోటీచేసిన జేపీ ఓడిపోవడంతో ఆ పార్టీకి చట్టసభలో ప్రతినిధి అంటూ లేకుండాపోయాడు. అయినా జేపీ ఆత్మవిశ్వాసం ఏమాత్రం సన్నగిల్లలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పార్టీని పటిష్టపరుస్తామని జేపీ చెబుతున్నారు. ప్రతి ఒక్క రాష్ట్రంలో పార్టీకి కమిటీలు నియమిస్తామని, లోక్‌సత్తాను మూడో ప్రత్యామ్నాయంగా ప్రజల ముందుకు తీసుకెళ్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే జేపీ తెలుగు రాష్ట్రాలోనే ఒక్కసీటులో కూడా గట్టి పోటీ ఇవ్వలేకపోతున్నారని, ఇక దేశవ్యాప్తంగా పోటీ చేస్తామని ఆయన ప్రకటించడం హాస్యాస్పదమనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఢిల్లీలో కేజ్రీవాల్ సారథ్యంలో ఆప్ పార్టీ సాధించిన విజయంలాగే లోక్‌సత్తా కూడా ఏదైనా సంచలనం సృష్టించాల్సి ఉంటుంది. అయితే ఢిల్లీ పరిస్థితులకు ఇతర రాష్ట్రాల పరిస్థితులకు ఎంత తేడా ఉంటుంతో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.