హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంత కాలం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఎంట్రీ ట్యాక్స్ విధించవద్దని ఆంధ్రప్రదేశ్ సర్కారు వాదిస్తోంది. మరోవైపు ఈ వాదనలను ఏమాత్రం పట్టించుకోని తెలంగాణ సర్కారు ఏప్రిల్ 1నుంచి ఎంట్రీట్యాక్స్‌ను వసూలు చేస్తోంది. దీనికి విరుద్ధంగా కోర్టుకు వెళ్లినా.. గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా ఏ ఫలితం లేకపోయింది. అయితే కోర్టు మాత్రం వాహనాల నుంచి రూ. 100 బాండ్‌పై హామీ తీసుకొని వాహనాలను ప్రస్తుతానికి తెలంగాణలోకి అనుమతించాలని మధ్యేమార్గంగా తీర్పునిచ్చింది. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ఏపీలోకి వచ్చే తెలంగాణ వాహనాలకు కూడా ఎంట్రీ ట్యాక్స్ వేయాలా లేక వద్దా అనే విషయాన్ని తేల్చుకోలేక ఏపీ ప్రభుత్వం సతమతమవుతోంది. ఒకవేళ వస్తే తెలంగాణ స్థాయిలో ఏపీకి కూడా ఆదాయం వస్తుందా అనేది అనుమానంగా ఉండటంతో బాబు ఏమి తేల్చుకోలేకపోతున్నారు. ఎంట్రీ ట్యాక్స్ ద్వారా తెలంగాణకు నెలకు ఏపీ వాహనాల నుంచి దాదాపు రూ. 30 కోట్ల ఆదాయం సమకూరుతోంది. హైదరాబాద్‌కు ఏపీ నంచి అనేక ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, సరుకులవాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక అదే మొత్తంలో తెలంగాణ నుంచి ఏపీకి వాహనాలు రాకపోకలు సాగిస్తాయన్నది అనుమానమే. దీంతో నామమాత్రంగా వచ్చే ఆదాయం కోసం ఏపీలో కూడా ఎంట్రీ ట్యాక్స్ విధిస్తే తెలంగాణ నుంచి వాహనాల రాకపోకలు ఆగిపోయి ఇతర దుష్పరిణామాలకు దారి తీస్తుందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు.