కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మోడీ సర్కారు గవర్నర్లను మార్చే పనిపెట్టుకుంది. కాంగ్రెస్ హయాంలో నియమితులైన గవర్నర్లను నయానో.. భయానో ఆ పదవుల నుంచి తొలగించేలా ఎన్‌డీఏ ఎత్తులు వేసింది. ఇక పదవి నుంచి దిగేది లేదని కొందరు మొండికేసినా వారికి చుక్కలు చూపించి రాజీనామా చేసేలా చేసింది. అయితే తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ రోశయ్యల జోలికి మాత్రం కేంద్ర ప్రభుత్వం రాకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి నమ్మినబంటులా ఉన్న రోశయ్యను యూపీఏ హయాంలో తమిళనాడు గవర్నర్‌గా నియమించారు. అందరి పదవులు తొలగిస్తున్న సమయంలో ఆయనకు మాత్రం కర్ణాటక రాష్ట్ర బాధ్యతలు కూడా అప్పజెప్పి మోడీ సర్కారు రాజకీయవర్గాలకు షాక్‌నిచ్చింది. ఆ తర్వాత కర్ణాటకకు వేరేవ్యక్తిని గవర్నర్‌గా నియమించిన విషయం విధితమే. అయితే ఇప్పుడు మాత్రం రోశయ్యకు పదవి గండం పొంచి ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఎలాగైన దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ తమిళనాడు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సమయంలో ఆ రాష్ట్ర గవర్నర్‌గా బీజేపీ అనుకూల వ్యక్తిని నియమించాలని మోడీ సర్కారు భావిస్తున్నట్లు అంచనా. అయితే రోశయ్యను పూర్తిగా పదవి నుంచి దించేస్తారా..? లేక వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.