సాధారణంగా విపక్షాల ఎమ్మెల్యేలు రాజీనామా చేసి అధికారపక్షంలో చేరుతుంటారు. ప్రభుత్వంలో ఉంటే పనులు చక్కబెట్టుకోవచ్చన్న ఆలోచన వారిని ఆ దిశగా ప్రోత్సహిస్తుంది. అయితే ఏపీలో దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఒక అధికారపార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారు. అది కూడా కడప జిల్లాలో టీడీపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి కావడం గమనార్హం. అసలు విషయమేమిటంటే ఒంటమిట్ట కోదండ రాముడి కల్యాణోత్సవంలో అధికారులు తనకు సరైన గౌరవం ఇవ్వలేదని మల్లికార్జునరెడ్డి వాపోయారు. తనకు, తన కుటుంబ సభ్యులతోపాటు అనుచరులను కూడా అధికారులు అవమానించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా తాను విప్ పదవితోపాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇంత చిన్న విషయానికి మల్లికార్జునరెడ్డి స్పందించిన తీరు అధికారపక్ష సభ్యులను విస్మయానికి గురిచేస్తోంది. ఏదైనా ఉంటే బాబుకు చెప్పి అధికారులపై చర్య తీసుకునేలా ఒత్తిడి తేవాలని కాని, ఏకంగా ఎమ్మెల్యే పదవికే రాజీనమా చేస్తాననడం సరైంది కాదని వారంటున్నారు. రాజకీయాల్లో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి. అధిష్టానం బుజ్జగింపు చర్యలకు దిగానే సదరు నాయకులు సర్దుకుపోతారు. ఇక మల్లికార్జునరెడ్డి విషయంలో కూడా ఇదే జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.