హైదరాబాద్ పదేళ్ళపాటు ఉమ్మడి రాజధాని
- అని విభజన చట్టంలో వుంది. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కి వచ్చే లారీలు, బస్సులు, కార్లు, ఆటోలు ‘‘ప్రవేశ పన్ను’’ కట్టాల్సిందే, అదీ ఏప్రిల్ 1వ తేదీ నుంచే. దీనివలన బస్సుల్లో ఒక్కో సీటుకూ రూ.3,675/- పన్ను. తెలంగాణకు ఏటా 500 కోట్ల ఆదాయం.
బస్సులపై ఈ ప్రవేశ రుసం వలన బస్సు టికెట్ ధర పెరుగుతుంది; లారీలపై ప్రవేశరుసుం వలన నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ఈ విషయమై సమీక్షిస్తానని సెలవిచ్చారు గౌరవనీయులైన గవర్నరుగారు; కేబినెట్ సమావేశమన్నారు పూజ్య ముఖ్యమంత్రిగారు. పరీక్షలు పూర్తయి పిల్లలు ఇళ్ళకు తిరిగి వెళ్తున్న వేళ బస్సులు బంద్; బండలు పగిలే ఎండల్లో సామాన్య ప్రయాణీకుడు ఏప్రిల్ ఫూల్ వలె వెర్రి చూపులు.
జాతీయ ప్రాజెక్టు పోలవరం : ముందు మీరు నిర్మాణం మొదలెట్టండి, మీ డబ్బుతో. ఆనక బిల్లులు చూపించండి, ఆడిట్ చేసి చెల్లు వేస్తాం అని చావు కబురు చల్లగా చేరవేశారు ‘లోటు బడ్జెట్’ ఆంధ్రప్రదేశ్‌కి. నిధుల విడుదలపై సంతోషం వ్యక్తం చేస్తున్న సుజనా చౌదరి వైపు వెర్రి చూపులు చూస్తోంది ఆంధ్రప్రదేశ్.
అన్న ఎన్టీఆర్‌కి ‘భారత రత్న’ ఇవ్వమని అడిగితే ఢల్లీిలో పీవీకి స్మారక మందిరం నిర్మిస్తామన్న ఎన్డీయే సర్కారువైపు దిమ్మరపోయి చూస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు.
రైతులను ఇబ్బంది పెడుతున్న సిఎం చంద్రబాబుపై ల్యాండ్ పూలింగ్ కేసు పెడతానంటున్నారు సిపిఐ నేత నారాయణ. రాష్ట్ర విభజనను సవాలు చేస్తూ విభజన బిల్లు చట్ట సభలకు రాకమునుపే కొందరు ప్రముఖులు కోర్టుకెళ్ళిన విషయం ఈ కామ్రెడ్‌కి తెలియదా? అనుకుంటున్నారు గుంటూరు వాసులు.
- ఏప్రిల్ 1 సందర్భంగా అలవాటుగా అందించే అందమైన కట్టుకధలకు దిన పత్రికలు స్వస్తిచెప్పి ఆంధ్రులవైపు నిర్వేదనతో చూస్తున్నాయ్!