ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దగ్గర అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం వంటి సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసి మంచి అనుభవం సంపాదించి ‘జిల్’తో డైరెక్టర్ అయ్యారు రాధాకృష్ణకుమార్. గోపీచంద్ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్‌గా యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించిన ‘జిల్’ చిత్రం లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాధాకృష్ణకుమార్‌తో ‘సినీజోష్’ ఇంటర్వ్యూ.
‘జిల్’ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్. దీనికి ఆ టైటిల్ పెట్టడానికి రీజన్?
జిల్ మనిపించే సన్నివేశాలు ఈ సినిమాలో చాలా వున్నాయి. ఫస్ట్‌టైమ్ హీరోయిన్‌ని హీరో చూసినపుడు, మొదటిసారి విలన్‌ని హీరో కలిసే సీన్.. ఇలా చాలా సీన్స్ ఆడియన్స్‌కి జిల్ ఫీల్‌ని కలిగిస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ‘జిల్’ అనే టైటిల్ అయితే పర్‌ఫెక్ట్‌గా వుంటుందనిపించి దాన్నే ఫిక్స్ చేశాం.
మీ మొదటి సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఎలా వుంది?
యు.వి.క్రియేషన్స్‌లాంటి పెద్ద బేనర్‌లో గోపీచంద్‌లాంటి పెద్ద హీరోతో నా మొదటి సినిమా చేయడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ సినిమాకి కాస్టింగ్ విషయంలో చాలా వర్క్ చేయాల్సి వచ్చింది. అలాగే గోపీచంద్‌గారిని దృష్టిలో పెట్టుకునే ఈ కథ రెడీ చేశాను. మొదట ఈ సినిమాలో రాశి ఖన్నాని హీరోయిన్‌గా అనుకోలేదు. తన ఎక్స్‌ప్రెషన్స్ చూసిన తర్వాత సావిత్రి క్యారెక్టర్ ఆమె పర్‌ఫెక్ట్‌గా చెయ్యగలుగుతుందన్న నమ్మకంతో రాశిని సెలెక్ట్ చేసుకున్నాం. కథ, కాస్టింగ్, పెర్‌ఫార్మెన్స్, ప్రొడ్యూసర్స్ సపోర్ట్ ఇవన్నీ బాగా కుదిరాయి. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. రిలీజ్ తర్వాత ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ మామూలుగా లేదు. చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వుంది. రిపీటెడ్ ఆడియన్స్ మా సినిమాకి రావడం నాకు అన్నింటికంటే ఎక్కువ ఆనందాన్ని కలిగించింది.
ఈ సినిమాలో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్న అంశాలేమిటి?
గోపీచంద్‌గారు ఈ సినిమాలో చాలా డిఫరెంట్‌గా వున్నారన్న అప్రిషియేషన్ మొదటి షో నుంచే వస్తోంది. అలాగే ఆ క్యారెక్టర్‌లో ఆయన పెర్‌ఫార్మెన్స్‌కి ఆడియన్స్ నుంచి క్లాప్స్ వస్తున్నాయి. మాస్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న గోపీచంద్‌గారిని ఫస్ట్ టైమ్ ఆ క్యారెక్టర్‌కి తగినట్టుగా స్టైలిష్‌గా చూపించే ప్రయత్నం చేశాం. అందులో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యానని ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ సినిమాలో లవ్ వుంది, యాక్షన్ వుంది, సెంటిమెంట్ వుంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ మధ్య నడిచే లవ్‌స్టోరీకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా డిఫరెంట్‌గా వున్నాయంటున్నారు.
ఈ సినిమా సక్సెస్ గురించి మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్స్?
మా గురువుగారు చంద్రశేఖర్ ఏలేటి సినిమా చూసిన తర్వాత చాలా ఎక్స్‌ట్రార్డినరీగా చేశావు. ఎంతో అనుభవం వున్న డైరెక్టర్‌లా తీసావు అని అప్రిషియేట్ చేశారు. ఆయన అలా చెప్పడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ప్రభాస్‌గారు ఎడిటింగ్ రూమ్‌లో ఫస్ట్ కాపీ చూసి ‘కరెక్షన్స్ చెప్పడానికి కూడా ఏమీ కనిపించడం లేదు. చాలా మంచి సినిమా తీశావు’ అని మెచ్చుకున్నారు.
నెక్స్‌ట్ ప్రాజెక్ట్స్?
రీసెంట్‌గా నాకు ఒక ప్రపోజల్ వచ్చింది. దానికి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి. అది ఓకే అయితే అఫీషియల్‌గా ఎనౌన్స్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్ కాకుండా నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా వున్నప్పుడు కొన్ని కథలు అనుకున్నాను. వాటిని డెవలప్ చేసి హీరోలకు వినిపించాలనుకుంటున్నాను. ‘జిల్’ తర్వాత నేను చేయబోయే సినిమా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ మూవీ అవుతుంది అంటూ ఇంటర్వ్యూ ముగించారు ‘జిల్’ డైరెక్టర్ రాధాకృష్ణకుమార్.