కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనిప్రకారం ఆడపిల్ల పుట్టినప్పటినుంచి ఆమె పెంపకం, చదువు తదితర ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఏటా కొంత ఆర్థికసాయాన్ని అందజేస్తుంది. ఈ పథకానికి మొదట బాగానే పేరు వచ్చింది. అయితే ఈ పథకాన్ని అమలు చేయడం కష్టసాధ్యమని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో బాలికన 20 ఏళ్లు పర్యవేక్షించి ఆర్థికసాయం అందజేయడం కష్టమని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇప్పటికే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేరిట ఆడపిల్లల వివాహానికి సాయం చేస్తూ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. అదేసమయంలో ఇక బంగారు తల్లి పథకాన్ని కూడా కొనసాగించడం ఆర్థికంగా భారంగా మారే అవకాశం ఉందని తెలంగాణ సర్కారు భావిస్తోంది. ఇటీవలే జరిగిన బడ్జెట్ సమావేశాల్లో బంగారు తల్లి పథకం గురించి కాంగ్రెస్ ప్రశ్నించగా.. ఆ పథకం అమలు సాధ్యాసాధ్యల గురించి ఆలోచిస్తున్నట్లు టీ-సర్కారు సమధానం ఇచ్చింది. అయితే ఈ పథకం అమలును ఆపేయాలని ఇప్పుడు తెలంగాణ సర్కారు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక ఏపీలో కూడా ఈ పథకం అమలును నిలిపివేస్తారా లేక కొనసాగిస్తారా అనేది వేచిచూడాల్సిందే..!