తెలంగాణలో ఉద్యోగుల పీఆర్సీ బకాయిల చెల్లింపు పెద్ద గందరగోళానికి దారి తీస్తోంది. పీఆర్సీ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం బాండ్లు జారీ చేసి ఆ తర్వాత నగదును అందిస్తుందంటూ కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం కొనసాగుతోంది. దీనిపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వేతనంతో కలిపే బకాయి చెల్లించాలని, లేకపోతే జీపీఎఫ్ ఖాతాలోనైనా జమచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలాచేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికభారం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పీఆర్సీ బకాయిల రూపంలో ప్రభుత్వం దాదాపు రూ. 5 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఇంతమొత్తాన్ని ప్రభుత్వం జీపీఎఫ్ ఖాతాలో జమచేస్తే ఆ మేరకు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే అవకాశాన్ని రాష్ట్ర సర్కారు కోల్పోతుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి రూ. 12900 కోట్ల వరకు రుణం తెచ్చుకునే అవకాశం ఉంది. ఇందులో రూ. 5 వేల కోట్లు పీఆర్సీ బకాయిల చెల్లింపుకే వెళ్లిపోతే ఇక మిగిలిన ప్రాజెక్టుల పనుల పురోగతి కష్టమని అధికారవర్గాల అంచనా. మరోవైపు బాండ్ల జారీకి ఉద్యోఘ సంఘాలు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఉద్యోగుల మద్దతు పొందడానికే 43శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు బాండ్లు జారీ చేసి ఉద్యోగులకు దూరం కావడానికి ఇష్టపడటం లేదు. దీంతో పీఆర్సీ బకాయిల చెల్లింపు బాండ్ల రూపంలో ఉండబోతుందా..? నగదు రూపంలో ఉండబోతుందా..? లేక జీపీఎఫ్ ఖాతాకు జమ చేస్తారా అనేది తేలకుండా ఉంది. అయితే కేసీఆర్ జీపీఎఫ్ ఖాతాలో జమచేయడానికే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.