కృష్ణగారి పేరు ముందు ‘సూపర్ స్టార్’ అన్న టైటిల్ చూడగానే ఉద్వేగం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ‘జ్యోతిచిత్ర’ సంపాదకత్వం, బ్యాలెట్ గుర్తొస్తాయి. కవరుపేజీ తారబొమ్మ ఆ పత్రిక అమ్మకాలను ప్రభావితం చేస్తుందని నిరూపించిన సూపర్ స్టార్ కృష్ణ. నా సినీ పాత్రికేయ అనుభవంతో చెబుతున్నా తెలుగులో జయాపజయాలతో ప్రమేయం లేకుండా ఓ హీరోని చివరకంటా అంటిపెట్టుకుని వున్న అత్యధిక అభిమానులు వున్నది హీరో కృష్ణ గారికే. ఆయనను చూడటానికి వచ్చిన అభిమానులతో నెల్లూరు రైల్వే స్టేషను ఒకనాడు అతలాకుతలమయింది. ఎన్టీఆర్ వలె ఎంత పెద్ద డైలాగునయినా సింగిల్ టేక్‌లో ఓకే చేయగల సామర్ధ్యం వుంది ఆయనకు. ఓపెనింగ్ కలెక్షన్సు అదిరేవి. గెటప్ విషయంలో ఆయన తన అభిమానుల అభిప్రాయాలను గౌరవించేవారు. బాలకృష్ణ సరసన ‘‘టాప్ హీరో’’ సినిమాకి హీరోయిన్‌గా కృష్ణగారి అమ్మాయి మంజుల ఎంపికయినప్పుడు అభిమానుల నిరసనని కృష్ణగారు గౌరవించారు. లేకుంటే కమల్ కుమార్తె శృతిహాసన్ వలె ఆమె లీడిరగ్ హీరోయిన్ అయివుండేది. అభిమానులు ఆయనను ఎంతగా అభిమానిస్తారో అంతకన్నా ఎక్కువగా ఆయన తన అభిమానుల్ని అభిమానిస్తారు. అది ఆయన బలహీనత. ఆయన పేరు కృష్ణ కానీ మనిషి బోళా శంకరుడు. అభిమానుల్ని నెత్తిన పెట్టుకుంటాడు. నందిగం రామలింగేశ్వరరావు, బి ఏ రాజు, నెల్లూరు కాంతారావు వంటి ఆయన అభిమానులు ఎందరెందరో ఈ సినిమా పరిశ్రమలో పెద్ద నిర్మాతలు, ప్రముఖ కళాకారులు. ‘కరుణామయుడు’ విజయచందర్ సినిమా పరిశ్రమకి రావడానికి ప్రేరణ కృష్ణగారేనని విజయ చందర్ స్వయంగా చెప్పుకున్నారు. అభిమానులే ఆయనకు అండ, దండ. వారసత్వంగా ఆస్తులు ఇచ్చిన తండ్రులను చూస్తాం, అభిమానుల్ని ఇచ్చిన హీరోలలో తొలి తాంబూలం హీరోకృష్ణ గారిదే అని సగర్వంగా చెబుతున్నా.
- తోటకూర రఘు